logo

సిబ్బంది కొరత.. వసతుల లేమి

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 28 Apr 2024 03:24 IST

జిల్లా రవాణాశాఖ కార్యాలయం దుస్థితి

లైసెన్సుల కోసం వరుసలో నిల్చున్న వాహనచోదకులు

హాజీపూర్‌, న్యూస్‌టుడే: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండలకు కార్యాలయం సిబ్బంది, వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. తరచూ  సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని సమస్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వాహనదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్డులు ముద్రించేందుకు తగినంత సిబ్బంది కరవయ్యారు. లక్షల ఆదాయం సమకూరే కార్యాలయంలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఎంవీఐలు, ఓ ఏఎంవీఐ ఉన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారిని నియమించకపోవడంతో ఇన్‌ఛార్జితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే క్రమంలో స్థానికంగా వాహనాల తనిఖీల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయంలో అన్ని పనులు అటెండర్లు, హోంగార్డులే చేస్తున్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం కానరావడం లేదు. కార్డుల పంపిణీ, ముద్రణలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. సకాలంలో కార్డులు అందకపోవడంతో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్యాలయ ఆవరణలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఓ చెట్టుకింద నిలిపిన వాహనం

వసతుల కల్పనలోనూ నిర్లక్ష్యమే...

జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. వీరందరికీ సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, నీడ వసతులు లేవు. మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం. కొద్దిపాటి వర్షం కురిసినా కార్యాలయ ఆవరణంతా బురదతో నిండిపోతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌లు, డ్రైవింగ్‌ పరీక్షలు బురదలోనే చేస్తుంటారు. వాహనదారులు రోజంతా చెట్ల నీడలో సేద తీరుతున్నారు. నామమాత్రంగా ఓ రేకుల షెడ్డు వేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదు. దీనికి తోడు సర్వర్‌ సాంకేతిక సమస్యలు పలుమార్లు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

సేవలు అందేలా కృషి చేస్తాం

సంతోష్‌కుమార్‌, ఇన్‌ఛార్జి జిల్లా రవాణాశాఖ అధికారి, మంచిర్యాల

వేసవిలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. తాగునీరు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఎన్నికల కారణంగా సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొంతమేరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందేలా కృషిచేస్తున్నాం.

జిల్లాలోని వాహనాలు, ఫీజుల వివరాలివే...

మొత్తం వాహనాలు: 2.46 లక్షలు
రిజిస్ట్రేషన్లు (రోజుకు): 30
లైసెన్సులు: 40  ఫిట్‌నెస్‌లు: 25
రోజువారీ ఆదాయం పన్నులు, ఫీజుల ద్వారా : రూ. 2.3 కోట్లు  (సుమారుగా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని