logo

పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట

పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు.

Updated : 28 Apr 2024 06:33 IST

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. ప్రధాన పార్టీలు స్థానికేతరులకే పెద్దపీట వేయడంతో ఓటర్లు ఆయా పార్టీలను చూసి ఓటు వేయడంతో 1962లో నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికేతరులే ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. తొలిసారి 1962లో మూడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం ఏర్పడింది. 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌, తిరుమలగిరికి చెందిన ఎం.ఆర్‌.కృష్ణ వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. అంతకుముందు రెండుసార్లు ఆయన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నియ్యారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం మొదలవడంతో ప్రత్యేక రాష్ట్రవాదంతో పోటీలో నిలిచిన తెలంగాణ ప్రజా సమితి అప్పట్లో ఆధిపత్యం కొనసాగించింది. 1971లో నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరఫున పోటీ చేసి గెలిచిన వి.తులసీరాం హైదరాబాద్‌ (గగన్‌పహాడ్‌) వాస్తవ్యులే. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1977లోనూ ఆయన రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కోదాటి రాజమల్లు పెద్దపల్లి వాస్తవ్యులే అయినప్పటికీ ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1983 ఉప ఎన్నికల్లో, 1984 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి తొలిసారిగా గెలిచిన గొట్టె భూపతి కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల) జిల్లాకు చెందినవారు. ఆ తర్వాత నాలుగుసార్లు (1989, 1991, 1996, 2004) ఎంపీగా గెలిచిన గడ్డం వెంకటస్వామి హైదరాబాద్‌కు చెందినవారే. 1998, 1999లో తెదేపా తరఫున గెలిచిన సుగుణకుమారి హైదరాబాద్‌ వాస్తవ్యురాలే. 2009లో ఎంపీగా గెలిచిన కాకా వెంకస్వామి వారసుడు వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌కు చెందినవారు కాగా, ఆయన తర్వాత 2014లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్‌ మెట్‌పల్లి నివాసులు. 2019లో గెలిచిన ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందినవారు. ఇది ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్థానికులు కాగా, మరో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి స్థానికేతరుడు. ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో వేచిచూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని