logo

సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి

గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

Published : 29 Mar 2024 05:44 IST

మిషన్‌ భగీరథ ఈఈతో మాట్లాడుతున్న పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, చిత్రంలో అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీ

వాంకిడి, న్యూస్‌టుడే : గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎనోలి కొలాంగూడ ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ ట్యాంకు ద్వారా ఏడాదిగా నీటి సరఫరా జరగడం లేదని, చేతిపంపుల్లోనూ నీరు తక్కువగా వస్తుండడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు పాలనాధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ట్యాంకును పరిశీలించారు. నీటి సరఫరా జరగకపోవడానికి గల కారణాలపై మిషన్‌ భగీరథ ఈఈ వెంకటపతిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పైప్‌లైన్‌ లీకేజీ సమస్యలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని విద్యుత్తు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామానికి మంజూరైన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు బెండార, వాంకిడి గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న నీటి కుంట నిర్మాణం, కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. ఏప్రిల్‌ నుంచి ఉపాధిహామీ కూలీలకు వేతనం పెరుగుతుందని, పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల వద్ద తాగునీరు, మెడికల్‌ కిట్‌, షామియానా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బెండార కార్యదర్శి నియమాళిక, ఎంపీఓ ఖాజా అజీజొద్దిన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రోహిత్‌, ఉపాధిహామీ ఏపీఓ శ్రావణ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని