logo

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి.

Updated : 18 Apr 2024 05:37 IST

ప్రభుత్వం పట్టించుకుంటేనే ఆనవాళ్లకు రక్షణ
నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. ఇవన్నీ వారసత్వంగా లభించిన సంపదలు. కానీ అవి శిథిలావస్థలో, ఆక్రమణలకు గురై, ఆదరణకు నోచుకోక నిర్లక్ష్యంగా ఉన్నాయి. వీటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. గత వైభవానికి చిహ్నంగా ఉండే కట్టడాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే భావితరాలు గత చరిత్రను ప్రత్యక్షంగా చూసే  అవకాశం కలిగించిన వారమవుతాం. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వారసత్వ సంపదపై ప్రత్యేక కథనం.

కమిటీ లేదు.. కనీస రక్షణ కరవు

వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వీలుగా గత ప్రభుత్వం రాష్ట్ర వారసత్వపు(రక్షణ, పరిరక్షణ, సంరక్షణ, నిర్వహణ) సంపద బిల్లు-2017ను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి పరిరక్షణకు కృషి చేయాల్సి ఉంటుంది. జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా వారసత్వ కమిటీలు వేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు చర్యలే లేవు. పురాతన ప్రదేశాల్లో గుప్త నిధులు ఉంటాయనే భావనతో అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలతో మందమర్రిలోని గాంధారి కోట, నిర్మల్‌ ప్రాంతంలోని నిమ్మరాజులు నిర్మించిన బత్తీస్‌గడ్‌, శ్యాంగడ్‌, వంగల్‌పేట్‌ దర్వాజా ప్రాంతాలు తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి.

  • ఆదిలాబాద్‌ జిల్లాలో జైనథ్‌ ఆలయం, బేల మండలం సదల్‌పూర్‌లోని భైరాందేవ్‌ ఆలయం, ఇచ్చోడ మండలం సిరిచెల్మ ఆలయం, నేరడిగొండ మండలం వడూర్‌లో కోట, ఉట్నూరులోని విఠలేశ్వర మందిరం, గోండుల కోట, మెట్లబావి ఆనాటి వారసత్వ సంపదే. సహజ సిద్ధమైన కుంటాల, పొచ్చరతో పాటు మరో ఏడు జలపాతాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి.
  • నిర్మల్‌ జిల్లాలో భైంసా, దిలావర్‌పూర్‌, ముథోల్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. ఆనాటి రాజులు నిర్మించినట్లు చెబుతున్న శ్యామ్‌గడ్‌, సోన్‌గడ్‌, నిర్మల్‌ దుర్గం, బత్తీస్‌గడ్‌ కోటలు నిర్మల్‌ జిల్లాలో ఉన్నాయి. బాసర అమ్మవారి ఆలయం, ఆకాశ దీపస్తంభం, శిథిలమైన పాపేశ్వరాలయం, ఖానాపూర్‌లోని రాజుల కోటను వారసత్వ సంపదగా పురావస్తుశాఖ గుర్తించింది.  

  • మంచిర్యాల జిల్లాలో తాండూర్‌ కోట, బురుజు, మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీ శివారంలో గాంధారి ఖిల్లా ఉంది. తాండూర్‌లో కోట, బురుజులు శిథిలమవుతున్నాయి. చెన్నూరులోని కుందారంలో త్రికూటేశ్వరాలయంలో కాకతి కుందవాంబ వేయించిన శిలాశాసనం ఉంది.

  • కుమురం భీం జిల్లా సమీపంలో పారేశ్వర్‌లోని రాతికట్టడాలు, వృక్షశిలాజాలు ఇప్పటికీ ఉన్నాయి. వాంకిడిలోని గంగాపూర్‌లోని పురాతన వేంకటేశ్వర ఆలయం, సిర్పూర్‌(టి)లోని కోట ఎన్నో సంవత్సరాల కిందట ఆసిఫాబాద్‌, వాంకిడిలోని శివ మందిరాలు నిర్మించారు.

నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే..

ప్రాచీన సంపదను పరిరక్షించేందుకు, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినా.. సకాలంలో పనులు చేయలేదు. కుంటాల జలపాతంలో సౌకర్యాలు, హోటల్‌, పర్యాటకులు ఉండేందుకు వీలుగా గదులు, రక్షణ చర్యలకు రూ.3.81 కోట్లు మంజూరు చేశారు. ఉట్నూరులోని కోట, మెట్లబావి, తదితర వాటితోపాటు మ్యూజియం ఏర్పాటుకు రూ.3.92 కోట్లు, కుమురంభీం జిల్లాలోని సప్తగుండాల జలపాతం సమీపంలో రోప్‌వే, వ్యూపాయింట్‌, ఫెన్సింగ్‌ తదితర వాటి నిర్మాణానికి రూ.1.35 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో పురోగతి లేదు. జైనథ్‌ ఆలయాభివృద్ధికి రూ.1.10 లక్షలు నిధులు మంజూరు కాగా పనులు పూర్తి చేయలేదు. మధ్యలో ఆపేశారు.  


ఉట్నూరులో గోండు రాజుల కోట పూర్తిగా రాతితో నిర్మించారు. చుట్టూ కందకం తవ్వి ఉంది. కోట లోపల కోనేరు, రాజాంతపురం, కోట ద్వారాలు, ఫిరంగి ఆనాటి వైభవానికి చిహ్నంగా ఉన్నాయి. దేవగిరి రాజుల సామంతులుగా గోండు రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో నిర్మించిన విఠలేశ్వర ఆలయం ఉట్నూరులో ఉంది. సమీపంలో కోనేరు ఉంది. రాతితో మెట్లతో నిర్మించారు. గోండు రాజుల వైభవానికి గుర్తుగా ఉన్న ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.


శ్రీ  జైనథ్‌ లక్ష్మీనారాయణ ఆలయం అత్యంత ప్రాచీనాలయాల్లో ఒకటి. శాతవాహనుల కాలం నాటిదని చెబుతారు. దేవనాగర లిపిలో సూర్యుని స్తుతిస్తూ శ్లోకాలతో ఉన్న శిలాఫలకం ఉంది. ఆలయం ఎదుట పెద్ద చెరువు ఉంది. చెరువు మధ్యలో డోలారోహణ మండపంతోపాటు సమీపంలో మరి కొన్ని ఆలయాలు శిథిలమై ఉన్నాయి. ఆలయాన్ని పూర్తి స్థాయిలో బాగు చేస్తే పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అవకాశం ఉంది.


నేరడిగొండ మండలం వడూర్‌ చారిత్రక ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ నిర్మించిన గిరిదుర్గ పురాతనమైనది. ఇప్పటి వడూర్‌, రాజుల కాలంలో వైడూర్యపురంగా పేరు పొందింది. గోండు రాజులు, మహారాష్ట్ర పీష్వాల ప్రతినిధులకు, నిజాంషాహితోపాటు గోలకొండ రాజులకు కేంద్రంగా వడూర్‌ దుర్గం ఉంది. ఫిరంగులు, అంతఃపురాలు, ధాన్యాగారాలు, ప్రాకారకుడ్యాలు శిథిలరూపంలో ఉన్నాయి. వాటిని సంరక్షించకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోక కొన్నేళ్ల తర్వాత వాటి ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది.


శ్రీ సిర్పూరును పూర్వం సూర్యపురం అని పిలిచేవారు. గోండురాజు బల్లాల్‌షా సిర్పూర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ కోటను నిర్మించారు. ఇప్పుడు ఆ కోట మొత్తాన్ని ఆక్రమించారు. కోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే, గత చారిత్రక వైభవాన్ని పరిరక్షించడంతోపాటు అప్పటి చరిత్రను, ఆనాటి కట్టడాలను భవిష్యత్తుతరాలకు అందించినట్లు అవుతుంది.


ఈ రోజే ఎందుకు

ప్రపంచ దేశాలలోని వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనిషియాలో 1982 ఏప్రిల్‌ 18న సమావేశం నిర్వహించారు. వారసత్వ సంపదను పరిరక్షించాలనే ఆలోచనతో సమావేశం జరిగిన రోజును ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించారు. వారసత్వ కట్టడాలపై ప్రజలను అవగాహన కలిగించడంతోపాటు వాటి పరిరక్షణకు తోడ్పడాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని