logo

ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..

మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి.

Published : 18 Apr 2024 03:49 IST

ఇంటిపై కప్పు ఎగిరిపోయి చిందర వందరగా మారిన సామగ్రి

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు విరిగి పోయాయి. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీ సైతం పక్కకు వాలడాన్ని గమనిస్తే.. గాలి ఎంత బలంగా వీచిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి క్షణాల్లోనే అతలాకుతలం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

ఎగిరిపోయిన మరో ఇంటి రేకులు

సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామంలో బలంగా ఈదురు గాలులు వీచాయి. దీని ధాటికి గ్రామంలోని పెంటయ్య, గోపాల్‌, పెంటక్క, జుజాడి బొడ్డు, రమేశ్‌, వినోద్‌, శంకర్‌, రాగులయ్యల ఇళ్ల పై కప్పులు ఎగిరి పోయాయి. కొందరి ఇళ్లపై ఉన్న రేకులు, వాటిపై ఉంచిన రాళ్లు సైతం గాలులకు ఎగిరి పంట చేలలో పడిపోయాయి. గాలితో పాటు కురిసిన వర్షానికి ఇళ్లలోని సామగ్రి తడిసి పోయింది. ఇంటి రేకులపై ఉన్న రాయి పెంటక్క అనే వృద్ధురాలి మీద పడింది. చిన్నక్క గాలికి కిందపడి గాయపడ్డారు. వీరిని ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గాలికి ఎగిరిపోయిన రేకు చంద్రయ్యకు చెందిన ఎద్దుపై పడడంతో గాయపడింది. రాజమండ్రి నుంచి కొబ్బరికాయల లోడ్‌తో మహారాష్ట్రకు వెళుతున్న లారీ రోడ్డు పక్కనే నిలిచి ఉంది. బలమైన గాలులు వీయడంతో ఒక్కసారిగా పక్కన వాలింది. దాబా హోటల్‌ పై కప్పు పూర్తిగా ఎగిరిపోయింది. పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. నాలుగు విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. ఈదురు గాలులు కొద్ది క్షణాలే వీచినా.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. పైకప్పులు లేచిపోయిన బాధితులు వాటిని సరిచేసుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని