logo

రాయితీ.. పక్కదారి!

జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్‌నగర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, పలు గ్యాస్‌తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి.

Updated : 18 Apr 2024 05:25 IST

గృహావసరాల సిలిండర్లు వ్యాపారానికి వినియోగిస్తున్న వైనం..

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్‌నగర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, పలు గ్యాస్‌తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. వాటి వినియోగానికి నిబంధనల ప్రకారం.. వాణిజ్య సిలిండర్లను వినియోగించాలి. కానీ పలువురు గుట్టుచప్పుడు కాకుండా రాయితీ గృహావసరాల సిలిండర్లను వాడుతుండటంతో.. రాయితీ పక్కదారి పడుతోంది. దీంతోపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500లకే సిలిండర్‌ ఇస్తుండటంతో.. మార్కెట్‌లో విచ్చలవిడిగా వీటినే వాడుతున్నారు. దీంతో గృహావసరాల వారికి కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది.

జిల్లాలోని ఏజెన్సీల్లో దాదాపు లక్షన్నరవరకు గృహావసర కనెక్షన్లు ఉన్నాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారికి  ఏడాదికి దాదాపు ఆరు సిలిండర్ల వరకు వినియోగిస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ, మారుమూల మండలాల్లో ఎక్కువగా ఇప్పటికీ వంట చెరుకునే వాడుతున్నారు. పొదువుగా వినియోగించే, వంట చెరుకు వినియోగించే వారి సిలిండర్లను దళారులు ఎంతో కొంత మొత్తానికి కొనుగోలు చేసి వాటిని రిఫిల్లింగ్‌ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. డొమెస్టిక్‌ సిలిండర్‌ రిఫిల్లింగ్‌ చేస్తే కిలోకు రూ.63, కమర్షియల్‌ అయితే రూ.115 వరకు చెల్లిస్తున్నారు. సదరు వ్యాపారులు వాణిజ్య సిలిండర్లకు బదులుగా ఇళ్లలో వాడే వాటిని వినియోగిస్తూ పెద్ద మొత్తంలో దళారులు లాభాలు గడిస్తున్నారు.

పనిచేసే వారే సూత్రధారులు..

గ్యాస్‌ ఏజెన్సీల్లో పని చేసే పలువురు ఉద్యోగులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీ నిర్వాహకులకు ఈ విషయం తెలియకపోవడంతో.. ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల కాగజ్‌నగర్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు 24 గృహావసర సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏజెన్సీల నిర్వాహకులకు తెలియకుండానే అందులో పనిచేసే వారే ఇదంతా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. యథేచ్ఛగా సాగుతున్నా అరికట్టాల్సిన అధికారులు ‘మామూలు’గానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడే వినియోగిస్తున్నా.. చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు రాయితీ సిలిండర్లను దుర్వినియోగం కాకుండా నిత్యం నిఘా పెట్టి అర్హులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.  

అధికారులు స్వాధీనం చేసుకున్న రాయితీ సిలిండర్లు

జనవరి 20వ తేదీన కాగజ్‌నగర్‌ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు గ్యాస్‌ దుకాణాలపై ఎన్‌ఫోర్సుమెంట్‌, రెవెన్యూ అధికారులు దాడులు చేయగా.. 24 రాయితీ సిలిండర్లు లభించాయి. రాయితీ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు. ముందస్తు ఫిర్యాదులు వస్తేనే  అధికారులు తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేక గృహావసర సిలిండర్లను వాణిజ్యానికి వినియోగిస్తూ రాయితీని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పలు ఆటోలు, కార్లు గ్యాస్‌తో నడుస్తుండగా.. పట్టణంలోని పెట్రోల్‌పంపు, మార్కెట్‌ ఏరియాల్లో ఉన్న దుకాణాల్లో రాయితీ సిలిండర్లనే వాడుతున్నట్లు తెలిసింది.  

జిల్లా వివరాలు..

మొత్తం ఏజెన్సీలు : 12
గృహావసర కనెక్షన్లు : 1,30,076
ఉజ్వల : 12,512
వాణిజ్య కనెక్షన్లు : సుమారు 2 వేలు
గృహావసర సిలిండర్‌ ధర: రూ. 880
వాణిజ్యం: రూ. 2,020

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని