logo

ఎన్నికల బరి.. 19వ సారి

ఆదిలాబాద్‌ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్‌సభ ఫలితాలను పరిశీలిస్తే.

Published : 19 Apr 2024 06:21 IST

అన్ని పార్టీలను ఆదరించిన ఆదిలాబాద్‌ ఓటర్లు

న్యూస్‌టుడే, రాంనగర్‌: ఆదిలాబాద్‌ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్‌సభ ఫలితాలను పరిశీలిస్తే.. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులను లోక్‌సభకు పంపించారు. ఆదిలాబాద్‌ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, ఉప ఎన్నికతో కలిపితే 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రారంభంలో కాంగ్రెస్‌ పార్టీని తరువాత తెలుగుదేశం, తెరాస, తాజాగా భాజపా అభ్యర్థులను ఓటర్లు ఆదరించారు. ప్రస్తుతం జరిగే   ఈ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తారనేది ఆసక్తిగా మారింది.


మంత్రిగా ఒక్కరే..

1952 నుంచి పలు పార్టీల నుంచి అభ్యర్థులు పార్లమెంట్‌కు వెళ్లినా ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వేణుగోపాలాచారి పని చేశారు. 1996 నుంచి 1998 వరకు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేశారు. తరువాత ఇప్పటి వరకు  మంత్రిగా ఎవరికి అవకాశం దక్కలేదు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని తొలిసారిగా 2019లో భాజపా దక్కించుకుంది. తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆచితూచి అభ్యర్థిని  ఎంపిక చేసింది. పార్లమెంట్‌ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఎమ్యెల్యేలు ఉండటంతో ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.


అన్ని పార్టీలకు ఆదరణ 

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌ ఏడు సార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, తెరాస రెండు సార్లు గెలవగా, ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ ఐ, సోషలిస్టు పార్టీ కూడా ఒక్కోసారి గెలిచింది. గతంలో జనరల్‌ స్థానంలో ఉన్న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం 2009 నుంచి ఎస్టీకి కేటాయించారు ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి జిల్లాలో 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిసారి ఎన్నికల్లో సోషలిస్ట్‌ పార్టీ గెలిచింది. ఈ పార్టీ నుంచి సి.మాధవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జె.వి.నర్సింగ్‌రావుపై 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తరువాత 1957 నుంచి వరుసగా 1980 వరకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 1984లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకున్నా.. మళ్లీ తిరిగి 1989లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1991 నుంచి వరుసగా తెదేపా తన ఆధిక్యతను చాటుకుంది. 1991లో ఇంద్రకరణ్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. తరువాత వరుసగా వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు.

2004లో జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ నియోజకవర్గంలో పాగా వేసింది. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి ఆదరించారు. తరువాత 2009లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మళ్లీ 2014లో తెరాస పార్టీని ఆదరించారు. ఎన్నికలు జరిగిన ప్రతి సారి నియోజకవర్గ ఓటర్లు విభిన్నమైన తీర్పును ఇచ్చారు. అన్ని పార్టీలను ఆదరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, భాజపా, తెరాసలు పోటీ పడుతుండటంతో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచార పర్వం మొదలైంది. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, స్థానిక నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించారు. నామినేషన్ల ఘట్టం పూర్తి తర్వాత ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. గతంలో అన్ని పార్టీలను ఆదరించి, గెలిపించిన ఆదిలాబాద్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.


మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు.. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు.

 అబ్దుల్‌ కలాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని