logo

ఉక్కపోత.. చిన్నారుల వెత

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 24 Apr 2024 07:27 IST

ఎండ తీవ్రతకు అంగన్‌వాడీ కేంద్రాల్లో తగ్గిన హాజరు..

తాంసి, ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో.. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. భవనాల్లో గాలి, వెలుతురు లేక ఉక్కపోతతో తల్లడిల్లుతున్న వైనంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,124 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు 1,95,043 మంది, గర్భిణులు 14,144 మంది, బాలింతలు 19,779 మంది వరకు ఉన్నారు. కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పోషకాహారం అందించడంతోపాటు చదువు నేర్పిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మీ పథకం పేరుతో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రాలకు సరైన భవనాలు లేకపోవడం సమస్యగా మారింది. దాదాపు 60 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇరుకైన అద్దె గృహాల్లో, రేకుల గుడిసెలు, పురాతన పాఠశాల భవనాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. సొంత భవనాలున్న చోట విద్యుత్తు సౌకర్యం లేదు. దీంతో పంకాల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. గాలి, వెలుతురు సైతం సరిగారాక చిన్నారులు వేసవి ప్రారంభం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు వచ్చే గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో తినలేకపోతున్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది.

తగ్గుతున్న చిన్నారులు..

అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో చాలా మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడం లేదు. పౌష్టికాహారం, భోజనం అందిస్తున్నా.. అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చి, పోషకాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యంతోపాటు పంకాలు, వెలుతురుకు సంబంధించిన ఏర్పాట్లు, తాగునీరు అందించాలంటున్నారు.

గాలి, వెలుతురు రాక..

తాంసి మండలం గిరిగామ్‌లో పురాతన కమ్యూనిటీ భవనంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 36 మంది చిన్నారులు ఈ కేంద్రానికి వస్తున్నారు. ఈ భవనంలో గాలి, వెలుతురు సక్రమంగా రాకపోవడం, పంకాలు సైతం లేకపోవడంతో ఎండ వేడిమి, ఉక్కపోతతో చిన్నారులు అల్లాడుతున్నారు. గర్భిణులు, బాలింతలు సైతం ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని 23 కేంద్రాల్లో సగానికిపైగా సొంత భవనాలు లేవు. ఇరుకు గదులు, పురాతన భవనాల్లో కొనసాగిస్తున్నారు.

పంకాలు లేక..

ఉట్నూరు గ్రామీణ మండలం కోలంగూడ అంగన్‌వాడీ కేంద్రం పాఠశాల భవనంలో ఉంది. ఈ భవనంలో ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతతో చిన్నారులు తల్లడిల్లుతున్నారు. మధ్యాహ్నం వరకు కేంద్రంలో ఉండలేక సగానికిపైగా మంది 10 గంటలకే ఇంటికి వెళ్లిపోతున్నారు. మరికొందరు చిన్నారులైతే వేసవి ప్రారంభం నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి అసలే రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని