logo

డిపోలకు చేరని... రేషన్‌ సరకులు

పలు రేషన్‌ డిపోలకు సరకులు చేరలేదు. మార్చి నెలాఖరు వచ్చినా సరకులు రాకపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ సాధ్యపడేలా కనిపించడం లేదు.

Published : 31 Mar 2023 03:09 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పలు రేషన్‌ డిపోలకు సరకులు చేరలేదు. మార్చి నెలాఖరు వచ్చినా సరకులు రాకపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ సాధ్యపడేలా కనిపించడం లేదు. గత రెండు నెలల నుంచి హమాలీలకు కూలీ ఛార్జీలను పౌరసరఫరాల సంస్థ(సీఎస్‌సీ) చెల్లించకపోవడంతో వారంతా నిరసనకు దిగారు. దీంతో ఏప్రిల్‌ నెల సరకులు డిపోలకు చేరవేయడం లేదు. ప్రతి నెలా 25 నుంచి 28 తేదీల మధ్య డిపోలకు సరకులు చేరవేసే వారు.

జిల్లాలో 638 డిపోలున్నాయి. బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం సగం డిపోలకు కూడా ఈ సరకులు చేరలేదు. హామాలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని రెండు రోజుల క్రితం సీఎస్‌సీ ఎండీ జిల్లా మేనేజర్లను ఆదేశించినప్పటికీ ఇంతవరకు వారి ఖాతాలకు నిధులు జమ కాలేదు. నిధులు ఇస్తేకాని సరకులు తరలింపు చేపట్టబోమని హమాలీలు పట్టుదలతో ఉన్నారు. బకాయిల చెల్లింపులు చేపట్టామని సరకులను యుద్ధ ప్రాతిపదికన డిపోలకు తరలించి పంపిణీ చేపడతామని అధికారులు చెబుతున్నా వాస్తవంగా ఆయా పరిస్థితులు కనిపించడం లేదు.

గతంలో హమాలీలకు కూలీ ఖర్చులు డీలర్లు చెల్లించేవారు. ఇటీవల ఈ పద్ధతిని సీఎస్‌సీ ఉన్నతాధికారులు మార్పు చేశారు. అప్పటినుంచి ప్రతి నెలా కూలీ ఛార్జీలు సక్రమంగా చెల్లించడం లేదు. హమాలీలు నిరసనకు దిగడంతో పేద వర్గాలకు సకాలంలో సరకులు అందని పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని