logo

గురువుల బదిలీల్లో గందరగోళం

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. పోస్టులు రద్దు, కొన్ని ఖాళీలను చూపకుండా బ్లాక్‌ చేయడం, దరఖాస్తుల అనంతరం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బదిలీల తీరుపై గురువులు అసంతృప్తితో ఉన్నారు.

Updated : 08 Jun 2023 03:02 IST

ఈనాడు, పాడేరు, అనకాపల్లి

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. పోస్టులు రద్దు, కొన్ని ఖాళీలను చూపకుండా బ్లాక్‌ చేయడం, దరఖాస్తుల అనంతరం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బదిలీల తీరుపై గురువులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పాత స్టేషన్‌ పాయింట్ల లెక్కింపులో పారదర్శకత లోపించిందంటూ వందలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జీవో నంబర్‌ 117, 128తో పాఠశాలల విలీనం, హేతుబద్దీకరణతో సుమారు 1400 పైగా ఎస్‌జీటీ పోస్టులు రద్దయిపోయాయి. ఇప్పటి వరకు ఆయాస్థానాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా వేరేచోటకు కదలాల్సిందే. ఈ ఎస్‌జీటీ ఖాళీల్లోనే 10 శాతం వరకు ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. కేటగిరి వన్‌ పరిధిలో స్కూళ్లలో ఖాళీలను చూపకపోవడంతో వీరంతా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఖాళీలు చూపక ఆందోళన: బదిలీల్లో కీలకమైన వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ఆరో తేదీ నుంచి మొదలైంది. తొలుత ప్రధానోపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్నారు. బుధవారం పాఠశాల సహాయకులు (ఎస్‌ఏ) ఖాళీలను ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరక్టర్‌ (ఎస్‌ఏ పీడీ) ఖాళీలు 109 వరకు ఉన్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే ఆ మేరకు ఖాళీలను మాత్రం వెబ్‌ ఆప్షన్లలో చూపడం లేదు. సంఘాల నేతల ఒత్తిడితో కొన్ని అదనపు ఖాళీలను ప్రదర్శిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎస్‌ఏ పీడీ ఖాళీలు చూపిస్తామని చెప్పినా వెబ్‌ ఆప్ష్‌న్లలో ఆ స్థానాలేవీ కనబడడం లేదు. బుధవారం రాత్రితోనే ఖాళీల ఎంపిక గడువు పూర్తికావడంతో వ్యాయామ ఉపాధ్యాయులంతా ఆందోళన చెందుతున్నారు. డీఈవో కార్యాలయానికి వెళ్లి తమ బాధలు చెప్పుకొన్నా ఫలితం లేకుండాపోయింది. ఎస్‌జీటీలు గురువారం ఖాళీలను ఎంచుకోవాల్సి ఉంది. వీరు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఒక్కొక్కరూ వంద నుంచి మూడు వందల పైగా ఖాళీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌జీటీ పోస్టులకు సంబంధించిన ఖాళీలను బ్లాక్‌ చేయడంతో చాలామంది పట్టణ, మైదాన ప్రాంతాల్లో బోధనకు దూరమవ్వనున్నారు.

చెప్పేదొకటి.. చేసింది మరొకటి: తెదేపా

ఉమ్మడి జిల్లాలో గ్రీవెన్స్‌కు 500 పైగా అర్జీలు వస్తే వాటిని పరిష్కరించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మండిపడ్డారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జీవోలో స్పష్టత లేదని.. ప్రభుత్వం గురువుల పట్ల కక్ష సాధింపు దిశగా ఈ బదిలీలను ఉపయోగించుకుంటోందని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. జీవోలో చెప్పిన అంశాలు ఒకలా ఉంటే.. బదిలీ దరఖాస్తులో అంశాలు మరోలా ఉన్నాయన్నారు. ఒక పాఠశాలలో పోస్టు పోతుందంటూ, మరలా అదే పాఠశాలలో కొత్తగా ఒక పోస్టు మంజూరైనట్లు ఖాళీలు చూపారంటే ఎంత అధ్వానంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారో అర్థమవుతోందన్నారు.

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: సీపీఎస్‌ను రద్దు చేయకుండా జీపీఎస్‌ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీసీపీఎస్‌ఏ సంఘం అధ్యక్షులు మాసాడ ఈశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు తప్ప దేన్నీ అంగీకరించమని స్పష్టంచేశారు. తక్షణమే కేబినెట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పదోన్నతులు కల్పించాలి

* పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో  పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు కె.కొండబాబు, సత్యనారాయణ, రాంబాబు, కన్నయ్య, శోభన్‌బాబు తదితరులు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2019 నుంచి తమకు పదోన్నతులు కల్పించలేదన్నారు. దీనిపై ఐటీడీఏ స్పందనలో విన్నవించినా కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట ఐటీడీఏల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు.

కౌన్సెలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని