logo

నాడు-నేడు.. దోచేశారు చూడు!

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు.

Updated : 18 Apr 2024 04:48 IST

పాఠశాలల్లో పనులు పైనపటారం.. లోన లొటారం
నిర్మాణ సామగ్రికి ఉన్నతస్థాయిలోనే కమీషన్లు
ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, హుకుంపేట, ఎలమంచిలి

బాలలంతా బడికెళ్తారు..
అక్షర జ్ఞానం పొందడానికి!
అధికార పార్టీ నేతలూ ఈ అయి దేళ్లు  బడివైపే చూస్తూ వచ్చారు..
అక్షరాలా లక్షలు కొట్టేయడానికి..

నాడు-నేడు పనులతో సర్కారీ బడులు బాగుపడింది తక్కువే. ఆ పనులు చేయించిన, చేసిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఎక్కువ బాగుపడ్డారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. ఉన్నత స్థాయిలో కమీషన్లు బొక్కేసి అవసరం లేనిచోట రూ. కోట్లు ఖర్చుచేసి, అవసరమైన చోట సొమ్ముల్లేక అసంపూర్తిగా నిర్మాణాలు వదిలేశారు.  

అనకాపల్లి జిల్లాలో 616 పాఠశాల్లో రెండోవిడత నాడు-నేడు పనులు మంజూరయ్యాయి. మొత్తం అంచనా విలువ రూ. 239 కోట్లయితే దశలవారీగా రూ. 92 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌గా విడుదల చేశారు. ఆ నిధులన్నీ ఎప్పుడో ఖర్చయిపోయాయి. తర్వాత విడుదల చేయాల్సిన సొమ్ములు రాకపోవడంతో తుదిదశలో ఉన్న పనులు అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా అదనపు గదుల నిర్మాణానికి నిధులు చాలక ఎక్కడికక్కడ మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. అల్లూరి జిల్లాలోనూ 949 పాఠశాలల్లో రూ. 216 కోట్ల అంచనా విలువైన పనులు చేపట్టినప్పటికీ అన్నిచోట్ల  అసంపూర్తి నిర్మాణాలే కనిపిస్తున్నాయి.

పాడేరులో ఓ ఆశ్రమ పాఠశాల చుట్టూ నాడు-నేడు నిధులతో నిర్మించిన ప్రహరీ కొద్దిరోజులకే కూలిపోయింది.


కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో టైల్స్‌ నాసిరకం వేయడంతో మంత్రి అమర్‌నాథ్‌ ఆ పనులపై అసంతృప్తి వ్యక్తం చేయగా సదరు ఉపాధ్యాయునిపై వెంటనే సస్పెన్షన్‌ వేటు వేశారు.

నిధులు మేసి.. పనుల్లో నాసి..

  • అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి పాఠశాలలో నాడు-నేడు కింద నిర్మించిన రక్షణగోడ చిన్నపాటి వర్షానికే నేలకొరిగింది. ఆ సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
  • విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చుకునిపాలెం పాఠశాలలో చేసిన నాసిరకం పనుల వల్ల తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులపై పైకప్పు పెచ్చులుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
  • విశాఖపట్నం తోటగురువు పాఠశాలలో ఖర్చు చేసిన నిధులు ఎక్కువ చేసిన పనులు తక్కువగా ఉండడాన్ని అధికారులే గుర్తించారు.
  • కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోనూ నాడు-నేడు పనుల్లో కమిటీలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి.

ప్రాణాలు తీశాయి

  • హుకుంపేట మండలంలోని ఉర్రడ, బొడ్డాపుట్టు ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనుల జాప్యం కారణంగా విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి బోధన సాగిస్తున్నారు. గతేడాది పాఠశాల సమీపంలో ఓ విద్యుత్తు ఓ స్తంభం విద్యార్థినిపై పడి చనిపోయింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
  • పాయకరావుపేట: దుర్గాకాలనీలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి సన్‌షేడ్‌ పలక మీదపడి గతేడాది అక్టోబర్‌ 9న ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ కుటుంబానికి రూ. 5 లక్షలిస్తామన్న సర్కారు రూ. 2 లక్షలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది.

కమీషన్ల కథ.. రూ.కోట్లలో వృథా

మ్మడి జిల్లాలో 239 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశారు. ఆయా పాఠశాలల్లో  నాడు-నేడు పనులు అవసరం లేకపోయినా కమీషన్ల కోసం నిర్మాణ సామగ్రి పంపించేశారు. బెంచీలు, చాక్‌బోర్డులు కొత్తవి తెప్పించారు. మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మించారు. బడి మొత్తాన్ని రంగురంగుల బొమ్మలతో నింపేశారు. రూ. కోట్లు ఖర్చు చేసేశారు. తీరా పనులన్నీ పూర్తయ్యాక ఆ బడులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయడం వల్ల ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని