logo

సీఎం కార్యాలయానికి గన్నవరం పంచాయితీ

గన్నవరం వైకాపాలో వర్గపోరు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)కు చేరింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య

Updated : 19 May 2022 03:16 IST

నేడు కీలక సమావేశం

వంశీ, దుట్టాలకు పిలుపు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: గన్నవరం వైకాపాలో వర్గపోరు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)కు చేరింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడంతో నియోజకవర్గంలో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. వంశీనే గన్నవరం బాధ్యతలు చూస్తారంటూ గతంలో స్వయంగా సీఎం జగన్‌ స్పష్టం చేసినా ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తెదేపా నుంచి వచ్చిన వంశీతో దుట్టా మొదట్లో బాగానే ఉన్నా రానురాను వివాదాలు మొదలయ్యాయి. రహదారుల కాంట్రాక్టులు, మైనింగ్‌ తవ్వకాలు, భూ సేకరణకు సంబంధించిన విషయాల్లో ఇరు వర్గాల మధ్య లుకలుకలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొందరు వంశీ మా కొద్ధు. కొత్త ఇన్‌ఛార్జిని నియమించాలంటూ విజయసాయిరెడ్డిని కలవడం, ఆ తర్వాత చలో తాడేపల్లికి ప్రయత్నించడం, వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్మానం చేయడం వంటి పరిణామాలు కాక పెంచాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వారి పెత్తనమేమిటంటూ ఎమ్మెల్యేపై తరచుగా దుట్టా వర్గీయులు విమర్శలు చేయడం, దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి జోక్యం కారణంగానే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని వంశీ వర్గీయులు ఆరోపించడం వర్గపోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో తనపై దుట్టా వర్గీయులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ బాపులపాడు తహసీల్దార్‌ కలెక్టర్‌ వద్ద వాపోవడం, జగనన్న కాలనీలకు, గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు మెరక తోలకుండా శివభరత్‌రెడ్డి నానా యాగీ చేస్తున్నారంటూ వివిధ గ్రామాల నాయకులు ప్రత్యక్ష ఆందోళనకు దిగడం వైకాపా ప్రతిష్ఠను బజారుకీడ్చాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పరంగా ఈ తరహా వర్గపోరు సరికాదనే ధోరణితో అధినాయకత్వం జోక్యం చేసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సీఎంవోకు రావాల్సిందిగా వంశీ, దుట్టాలకు పిలుపు వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం చర్చనీయాంశమైంది. మరి కొంతసేటికి భేటీ జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా గురువారం సాయంత్రానికి వాయిదా పడినట్లు సమాచారం వచ్చింది. దీంతో గురువారం రాత్రికి గన్నవరం వైకాపా పగ్గాలు ఎవరికనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని