logo

రాష్ట్రపతి పర్యటనకు చకచకా ఏర్పాట్లు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో పోరంకిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 03 Dec 2022 05:33 IST

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా,ఎస్పీ జాషువా,

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఓఎస్‌డీ శశిధర్‌ రెడ్డి, ఇతర అధికారులు

పోరంకి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో పోరంకిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం మురళీ రిసార్ట్స్‌కు వెళ్లే పోరంకి - నిడమానూరు మార్గానికి రెండు వైపులా దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లను, ముళ్ల కంపను యంత్రాలతో తొలగిస్తున్నారు. రహదారులపై గుంతలను పూడ్చి వేస్తున్నారు. నారాయణపురం కాలనీ సమీపంలో విశాలమైన ప్రదేశంలో వాహనాల పార్కింగ్‌కు ఎంపిక స్థలాన్ని బుల్‌డోజర్లతో చదును చేస్తున్నారు. కి.మీ దూరం నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోరంకి - నిడమానూరు రోడ్డులో అధునాతన ఎత్తయిన స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేశారు.  రాష్ట్రపతి, గవర్నర్‌ రాక సందర్భంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జిల్లా ఎస్పీ జాషువా, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఓఎస్‌డీ శశిధర్‌ రెడ్డి తెలిపారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరుగుతున్న పౌరసన్మాన ఏర్పాట్లను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు శుక్రవారం పర్యటించారు. ఐదుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 36 మంది ఎస్సైల ఆధ్వర్యంలో 400 మంది పోలీస్‌ సిబ్బందిని భద్రత కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు.

* కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్మ్రణ్య రెడ్డి, ఎస్కార్ట్‌ అధికారి మేరీ ప్రశాంతి, అడిషనల్‌ ఎస్పీ రామాంజనేయులు, డీఎస్పీ కె. విజయపాల్‌, సీఐలు గోవిందరాజు, వెంకటనారాయణ, ఉయ్యూరు ఆర్డీవో ఎన్‌. విజయ్‌ కుమార్‌, డీఈవో తాహెరా సుల్తానా, తహశీల్దార్‌ సతీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌. ప్రకాశరావు పాల్గొన్నారు.


పోలీసుల వలయంలో విమానాశ్రయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 4న (ఆదివారం) విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోలీసు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం విమానాశ్రయం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు రన్‌వే, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి, విమానాశ్రయం పరిసరాల్లో ముందస్తు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులతో జిల్లా ఎస్పీ జాషువా విమానాశ్రయంలో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తొలిసారి రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమ నిర్వహణ ఉండేలా చూడాలన్నారు.  ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు భద్రత చర్యల్లో పాల్గొనే వైద్య, పోలీసు, ఇతర విభాగాల సిబ్బందికి పలు పరీక్షలు నిర్వహించారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనుండగా... హైవేపై పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నేడు ముందస్తు ట్రైల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి గూడవల్లి వరకు ఉన్న కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం సుమారు 800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. ఇంటెలిజెన్స్‌ భద్రత విభాగం ఓఎస్‌డీ శశిధర్‌రెడ్డి, ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌వర్మ, జేసీ అపరాజితాసింగ్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యరెడ్డి, ఉన్నతాధికారులు మేరీప్రశాంతి, విమానాశ్రయ డైరెక్టర్‌ ఎమ్‌ఎల్‌కే.రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు