అక్రమంగా తవ్వి.. అడ్డంగా పోస్తూ!
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు.
మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు
రహదారులు ఛిద్రమయ్యేలా టిప్పర్ల రాకపోకలు
ఈనాడు, అమరావతి, గుడివాడ (నెహ్రూచౌక్), న్యూస్‌టుడే
చెరువు కట్టను అక్రమంగా మూసేసి మరీ మెరక
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు. తాజాగా గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు శివారు వ్యవసాయ భూముల్లోకి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు టిప్పర్లతో పెద్దఎత్తున మట్టిని తెచ్చి పోస్తున్నారు. పక్కనే ఉన్న నందివాడ మండలం పుట్టగుంటలో ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వి తీసుకొచ్చిన మట్టిని ఇక్కడ పోస్తున్నారు. వ్యవసాయ భూమిని మెరక చేసి భారీగా వెంచరు వేస్తున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే కీలక అనుచరుడి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఇటువైపు అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు.
పుట్టగుంట నుంచి ఈ మట్టి లారీలు నాగవరప్పాడులోని ప్రైవేటు వెంచర్‌కు తీసుకెళ్లాలంటే మధ్యలో జనార్థనపురంలో ఉన్న ఆర్డీవో ట్రాక్ మీదుగానే రావాలి. టన్నుల కొద్ది అధిక లోడుతో టిప్పర్లు మట్టితో వస్తుండడంతో రహదారులు కూడా ధ్వంసమవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అయినా.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. వ్యవసాయ భూమిని.. వ్యవసాయేతరగా మార్చుకునేందుకు అనుమతి తీసుకున్నారంటూ గుడివాడ తహసీల్దారు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఐదు ఎకరాలను వ్యవసాయేతరగా మార్చుకునేందుకు అనుమతులు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ మట్టి గురించి మాత్రం తమకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారు. ఆ మట్టిని తవ్విన దగ్గరే అనుమతులున్నాయా.. లేదా.. అనేది చూడాలని, తర్వాత ఎక్కడైనా తెచ్చి పోసుకోవచ్చంటూ.. దానితో తమకేం సంబంధం లేదంటూ చెబుతుండడం గమనార్హం. నందివాడలోని పుట్టగుంటలో ఆక్రమిత ప్రభుత్వ భూమిలో ఈ మట్టిని విచ్చలవిడిగా తవ్వుతూ.. దర్జాగా గుడివాడకు తెచ్చి ప్రైవేటు స్థలంలో పోస్తున్న విషయం అధికారులందరికీ తెలుసు. అయినా నందివాడ, గుడివాడ రెండు మండలాల్లోనూ రెవెన్యూ, మైనింగ్ సహా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా.. తవ్వుతున్నది మా దగ్గర కాదని ఒకరు, మట్టిని పోస్తున్నది మా దగ్గర కాదంటూ మరొకరూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు.
భారీ టిప్పర్లతో యథేచ్ఛగా తరలిస్తున్న మట్టి
అనుమతులపై అనుమానాలు..
నాగవరప్పాడులో మెరక చేస్తున్న భూమికి ఆనుకుని చెరువు, మురుగు కాల్వ ఉన్నాయి. వీటిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టను మట్టితో కప్పేశారు. ఇవి రాష్ట్ర రహదారికి పక్కనే ఉండడంతో చెరువు, కాలువపై అక్రమార్కుల కన్ను ఎప్పటి నుంచో ఉంది. మెరక చేస్తున్న భూమిలో ఎన్ని సర్వే నంబర్లున్నాయి, నాలాలో దేనికోసం అనుమతి తీసుకున్నారనేది చెప్పకుండా అధికారులు సైతం గోప్యంగా ఉంచుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పేదల ఇళ్ల లేఔట్లకు మాత్రం లేదట...
నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో పేదల ఇళ్ల కోసం కేటాయించిన జగనన్న లేఔట్లను మెరక చేసేందుకు మట్టి లేదనే కారణంతో పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్క నందివాడ మండలంలోనే జగనన్న కాలనీ లేఔట్లు 27 ఉండగా.. వాటిలో కేవలం జొన్నపాడు తప్ప మరెక్కడా మెరక చేయలేదు. 26 లేఔట్లను మట్టి లేదనే సాకుతో గలికొదిలేశారు. గుడివాడ రూరల్, గుడ్లవల్లేరుల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పుట్టగుంటలో అక్రమంగా తవ్వి ఇప్పటివరకూ తరలించిన మట్టితో కనీసం 15 నుంచి 20 లేఔట్లను మెరక చేసేయొచ్చు. కానీ మట్టికి భారీ డిమాండ్ ఉండడంతో హనుమాన్‌జంక్షన్ సహా పలు ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి నందివాడ మండలంలో రూ.10వేలు, బయటకు వెళితే.. రూ.12 నుంచి రూ.15వేల వరకూ అమ్ముకుంటున్నారు. అటు మట్టి తవ్వకాలు అక్రమమే, ఇటు అరకొర అనుమతులు తీసుకున్న ప్రైవేటు స్థలాల్లో దానిని పోయడమూ అక్రమమే.. అయినా అధికారులకు మాత్రం పట్టడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
MLC Kavitha: 8 గంటలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..