logo

రాజధానిలో మట్టి పెళ్లనూ పెకిలించలేరు

ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని, దానిని తరలించడం కాదు... మట్టి పెళ్లను కూడా పెకిలించలేరని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు.

Updated : 01 Apr 2023 06:32 IST

మందడం శిబిరంలో నినదించిన వక్తలు
1200వ రోజుకు రాజధాని ఉద్యమం

భాజపా నాయకుడు సత్యకుమార్‌కు పూలదండ వేసి సత్కరిస్తున్న అమరావతి మహిళలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 1200 రోజులు పూర్తి చేసుకుంది. పోలీసు కేసులు, ఆంక్షలు, నిర్బంధాలను దాటుకొని మొక్కవోని దీక్షతో రైతులు, రైతు కూలీలు, మహిళలు పోరుబాట కొనసాగిస్తున్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని పలు రూపాల్లో నిరసనలు, దీక్షలు, ఆందోళనలు చేస్తున్న రైతన్నలు... మరో వైపు రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నారు.

తుళ్లూరు, అమరావతి న్యూస్‌టుడే: ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని, దానిని తరలించడం కాదు... మట్టి పెళ్లను కూడా పెకిలించలేరని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మందడం శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కుల, మత, వర్గ, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా నాయకులు తరలివచ్చి మద్దతు తెలిపారు. తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, సీపీఎం, సీపీఐ, జైభీం తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ముక్తకంఠంతో నినదించారు. ఆంధ్రులంతా ఒక్కటే, అమరావతి ఒక్కటే, ముఖ్యమంత్రి మొండి వైఖరి నశించాలి, జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు.


‘జగన్‌ ఇంటికిపోతేనే అమరావతి అభివృద్ధి’

మంగళగిరి, న్యూస్‌టుడే: ‘ఈ నెల మూడో తేదీన సీఎం జగన్‌ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల విషయం చెబుతారని అంటున్నారు. అదే నిజమైతే ప్రతిపక్షాల నెత్తిన పాలుపోసినట్లే. జగన్‌ ఇంటికి పోయి రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ మందడంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మంగళగిరి నుంచి శుక్రవారం ద్విచక్రవాహనాలతో ప్రదర్శనగా వెళ్లారు. ప్రదర్శనను రామకృష్ణ ప్రారంభించారు. తరువాత సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్‌, అక్కినేని వనజతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘తొందరగా ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. జగన్‌ ఇంటికిపోతే అమరావతి అభివృద్ధి అవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. పోలవరానికి నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రం మెడలు వంచుతానని చెప్పి మోదీ మోకాళ్ల వద్ద కూర్చుంటున్నావు. కేంద్రం పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పటికీ మాట్లాడలేని ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. రైతులు, మహిళలపై కేసులు పెట్టించారు. అయినా సరే ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారనంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని విజ్ఞత ప్రదర్శించాలి’ అని సూచించారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టుకు వెళితే స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. మూడు రాజధానుల డ్రామా ఎవరూ నమ్మడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పినప్పటికీ ఏ మాత్రం పట్టడం లేదు. కేంద్రం కూడా ఎలాంటి సలహా ఇవ్వడం లేదు. ఇక్కడ భాజపా నాయకులు పాదయాత్రలో పాల్గొంటూ దిల్లీలో మాట్లాడకుండా డబుల్‌గేమ్‌ ఆడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా రాజధాని ఇక్కడే అని ప్రకటన చేయాలని కోరుతున్నాం. విశాఖ రాజధాని కావాలని ఎవరూ కోరుకోవడం లేదు’ అని అన్నారు.


కేంద్రం జోక్యం అవసరం

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజధాని లేని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి.  అమరావతికి మంజూరు చేసిన కేంద్ర సంస్థల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి. వేల మంది రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్న జగన్‌కు బుద్ధి చెప్పాలి. రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

 సుంకర పద్మశ్రీ, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌


కన్నీళ్లు ఇంకిపోయాయి..

నాలుగేళ్లగా రాజధాని రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఇక కన్నీరు కార్చడానికి నీళ్లు లేవు. రక్తమే ఉంది. ఇప్పటికైనా భాజపా నాయకులు చొరవ తీసుకొని చట్టం చేయడానికి కారణమైన హోం శాఖ తరుపున మంత్రి అమిత్‌షా స్పందించి అమరావతిని కేంద్రం కట్టిస్తుందని ప్రకటించాలి.

 వెలగపూడి రామకృష్ణబాబు


అమరావతి ఎటూ కదలదు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెదేపా విజయం సాధిస్తుంది. ఫలితంగా అమరావతి కూడా విజయం సాధిస్తుంది. అమరావతి మనదే. ఇక్కడ నుంచి ఎటూ కదలదు. నాలుగేళ్లలో ఎంతోమంది మీద దాడులు చేశారు. ప్రపంచంలో మహిళలు ముందుకు తీసుకెళ్లిన ఉద్యమంగా అమరావతి ఉద్యమం చరిత్రలోకెక్కింది.

గద్దె అనురాధ, తెదేపా నాయకురాలు


వైకాపాను గద్దె దించడమే లక్ష్యం

డిసెంబర్‌ తరువాత ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ఇంటిని జప్తు చేసి అమరావతి ప్రదర్శన శాలగా మారుస్తాం. సీఎం రాష్ట్రంలో ఉండటానికి వీలు లేకుండా చేస్తాం. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం. రాజధానిపై ప్రధాన మంత్రి మోదీ, అమిత్‌షా స్పందించాలి. దేశంలో కొత్త పార్లమెంట్‌ భవనం కట్టారు. పక్క రాష్ట్రంలో నూతన సచివాలయం కట్టారు. మాకు రాజధానే లేకుండా చేశారు. ఇప్పటికైనా దుర్మార్గులను వదిలి రాజధాని రైతుల వైపు ప్రజాప్రతినిధులు రావాలి.  

పోతులు బాలకోటయ్య, దళిత బహుజన కన్వీనర్‌


అన్నదాతలతో పెట్టుకోవద్దు

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిన చట్టాలను అన్నదాతలు వ్యతిరేకిస్తే ప్రధానమంత్రి మోదీ వెనక్కి తగ్గి వాటిని ఉపసంహరించుకున్నారు. రాజధాని విషయంలో మాత్రం మూర్ఖంగా వెళుతున్నారు. ఇప్పటికైనా జగన్‌ ఒక అడుగు వెనక్కి వేసి చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలి. రైతులతో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ మసైపోయారు. అన్నదాతలతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నా.

కుమారస్వామి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకుడు


నట్టేట ముంచారు

సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే శ్రీదేవిపై దాడి జరుగుతున్న నేపథ్యంలో రాజధాని రైతులు ఆమెకు భరోసాగా ఉండాలి. రాజధాని రైతులు ఎంత నరకం అనుభవించారో ఇప్పటికైనా ఆమె అర్థం చేసుకోవాలి.దళితుల రాజధానిగా మార్చిన చంద్రబాబును కాదని జగన్‌ను నమ్మితే అందరినీ నట్టేట ముంచారు.

శోభారాణి, తెదేపా నాయకురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని