logo

సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు.

Published : 31 May 2023 05:06 IST

మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు. పక్కన నాయకులు, ఉద్యోగులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. మంగళవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ఐకాస అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొప్పరాజు.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా సరే ఉద్యమాన్ని ఆపేది లేదని, నేటికి 83వ రోజు అని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్‌లపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటి వరకు చేసిన ఉద్యమ ఫలితంగా.. కొన్ని ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించినప్పటికీ మిగిలిన వాటిపై స్పష్టత ఇవ్వాలని, లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కొత్త కోరికలు కోరడం లేదని చెప్పారు. నల్ల బ్యాడ్జీలతో ప్రారంభించిన ఉద్యమం.. నేడు ఉవ్వెత్తున ఎగిసి పడటానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వివరించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి వినిపించేది ప్రభుత్వ వాదనేనని విమర్శించారు. గతంలో ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారని, సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్‌, డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అవసరమా..? లేదా...? అనే విషయం వెంకటరామిరెడ్డి తేల్చిచెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడిన విషయాలన్నీ.. ప్రభుత్వం మాట్లాడినట్టుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడం తగదన్నారు. జూన్‌ పదో తేదీ తర్వాత ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లుతో సహా మిగిలిన వారికి జి.ఓబులేసు మంచినీరు అందించి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు పలిశెట్టి దామోదరావు, వీవీ మురళీకృష్ణ, ఎ.సాంబశివరావు, దేవపల్లి శ్రీనివాస్‌, ఏనుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని