logo

Vijayawada: రైతు కాకున్నా.. భరోసా ఇచ్చారట!

ఆమె విజయవాడ నగర తెదేపా కార్పొరేటర్‌. రైతు కాదు. ఎలాంటి పొలం కూడా లేదు. అయినా.. వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ.61వేలు లబ్ధి చేకూర్చినట్లు కరపత్రం ఇచ్చారు.

Updated : 15 Mar 2024 07:24 IST

కార్పొరేటర్‌కు రూ.61,000 లబ్ధి చేకూరినట్లు కరపత్రం

రాజేశ్వరి

న్యూస్‌టుడే, మాచవరం (విజయవాడ): ఆమె విజయవాడ నగర తెదేపా కార్పొరేటర్‌. రైతు కాదు. ఎలాంటి పొలం కూడా లేదు. అయినా.. వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ.61వేలు లబ్ధి చేకూర్చినట్లు కరపత్రం ఇచ్చారు. ఇది చూసిన ఆమె.. నాకెప్పుడు లబ్ధి చేకూర్చారు? అంటూ విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే.. వల్లభనేని రాజేశ్వరి విద్యావంతురాలు. విజయవాడ నగరపాలక సంస్థ 26వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమెకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.61వేలు ఇచ్చినట్లు వాలంటీర్‌ వెళ్లి ‘గడప గడపకూ సంక్షేమం’ కరపత్రాన్ని అందజేశారు. ఆ కరపత్రంలోని సందేశాన్ని చూసిన ఆమె అవాక్కయ్యారు. ‘ప్రియమైన అక్క/అన్న రాజేశ్వరి వల్లభనేని గారికి (గుణదల-06 సచివాలయం, విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా) ఈ 5ఏళ్ల పాలనలో మీ కుటుంబానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలు అందించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వైఎస్సార్‌ రైతు భరోసా రూ.61,000.. చేకూరిన లబ్ధి రూ.61,000. మొత్తం లబ్ధి రూ.61,000లు. మీ వై.ఎస్‌.జగన్‌.’ అని ఉంది.

వాలంటీర్‌ ఇచ్చిన కరపత్రం

ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో?

కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి భూమి లేదని, లేని భూమికి వైఎస్సార్‌ రైతు భరోసాగా రూ.61వేలు ఇచ్చినట్లు గడప గడపకూ సంక్షేమం కరపత్రాన్ని ఇంట్లో అత్తయ్యకు వాలంటీర్‌ ఇచ్చి వెళ్లారు. బయట నుంచి వచ్చిన తర్వాత కరపత్రం చూసి షాకయ్యాను. ఒక విద్యావంతురాలినైన కార్పొరేటర్‌గా ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. లబ్ధి చేకూర్చకుండానే ఇచ్చినట్లు చూపిస్తూ కరపత్రాన్ని పంపిణీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. నా పేరుపై ఉన్న ఏ భూమిని చూసి రైతు భరోసా ఇచ్చారో.. ఆ భూమి ఎక్కడ ఉందో ప్రభుత్వం చూపించాలి.’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని