logo

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. జయపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ(32) తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమిలో కొన్నేళ్లుగా టమోట, మిరప, కళింగర పంటలు సాగు చేసేవాడు.

Published : 01 Jun 2023 04:24 IST

ఆదినారాయణ (పాతచిత్రం)

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. జయపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ(32) తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమిలో కొన్నేళ్లుగా టమోట, మిరప, కళింగర పంటలు సాగు చేసేవాడు. రెండు మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో రూ.12లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంటలు పండక, వాటిని తీర్చే మార్గం కనిపించలేదు. అప్పులు తిరిగి చెల్లించాలన్నా ఒత్తిడి పెరిగింది. చేసేదేమి లేక మంగళవారం గ్రామ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా చికిత్స కోసం అనంతపురం తరలించగా బుధవారం మృతి చెందాడు. భార్య భూలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


పెళ్లికాలేదని వాలంటీరు బలవన్మరణం

బుక్కపట్నం, న్యూస్‌టుడే : బుక్కపట్నంలో వాలంటీరుగా పనిచేస్తున్న చిల్లా ప్రభాకర్‌ (31) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులను విచారించిన కుటుంబ సభ్యులు తమ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ విషద్రావణం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రభాకర్‌ను చూసి.. వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ రంగ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


మద్యం మత్తులో ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : మద్యం మత్తులో ఈత కొట్టేందుకు బావిలో దిగిన యువకుడు శవమై తేలాడు. ఈ ఘటన పుట్టపర్తి మండలంలోని కప్పలబండలో జరిగింది. గ్రామ రైతు చంద్రవర్ణచౌదరి వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించి పరిశీలించారు. బావి ఒడ్డున ఉన్న టీషర్ట్‌, ప్యాంట్‌లో ఉన్న సిమ్‌ కార్డుల ఆధారంగా విశాఖపట్నం  చెందిన ఆముదాల పూజిత సూర్యకుమార్‌ (28)గా గుర్తించారు. రామకృష్ణనగర్‌, హెచ్‌పీ పెట్రోల్‌ బంకు చిరునామాగా కనుగొన్నారు. పోలీసుల విచారణ చేయగా.. సీకేపల్లి మండలం బసంపల్లికి చెందిన బండ్ల బానుచందర్‌, సూర్యకుమార్‌ కలిసి రైల్వే క్యాంటీన్‌లో పనిచేస్తుండగా.. ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కరోనా సమయంలో బానుచందర్‌ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి మంగళవారం కప్పలబండ వ్యవసాయ బావి వద్ద కలిసి మద్యం తాగారు. ఇంటికెళ్దామని పిలవగా.. బావిలో ఈత కొట్టి వస్తానని చెప్పడంతో బానుచందర్‌ వెళ్లిపోయాడు. బుధవారం అతను బావిలో శవమై తేలాడు. సూర్యకుమార్‌ ఈత రాక పోవడంతోనే మృతి చెందారా..? లేదా మరో కారణం ఏదైనా ఉందా..? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌, దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ జయనాయక్‌ తెలిపారు. మృతుని బంధువులు వచ్చాక వారు ఇచ్చే ఫిర్యాదును బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. సీఐతోపాటు ఎస్‌ఐ దాదాపీర్‌ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని