logo

తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి

ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్‌ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్‌తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్‌ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు.

Published : 18 Apr 2024 04:24 IST

బాధితుడు సంతోశ్‌ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్‌ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్‌తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్‌ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయన్న అనుమానంతో తెదేపా నాయకత్వం పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా వారు కూడా ఓటర్ల వివరాలు పరిశీలిస్తుండగా వైకాపా నాయకులు అడ్డగించారు. వివరాలు సేకరించరాదని వాగ్వాదానికి దిగారు. వారి చేతిలో ఉన్న పుస్తకాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా వైకాపా నాయకులు జోగి భీమ, హనుమంతు, శర్మస్‌, రామిరెడ్డి, మనోహర్‌, నూరుద్దీన్‌, రాజశేఖర్‌, అమర్‌నాథ్‌ మూకుమ్మడిగా సంతోశ్‌పై దాడి చేశారు. అతను కింద పడిపోగా కాళ్లతో తన్నుతూ భయభ్రాంతులకు గురి చేశారు. అడ్డువెళ్లిన నాగభూషణను తోసేశారు. తెదేపా నాయకులు ఇటువైపు ఎవరూ వచ్చినా అంతు చూస్తామంటూ.. వైకాపా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. స్థానిక తెదేపా నాయకులు బాధితుడు సంతోశ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా ఓటర్ల పరిశీలనకు వచ్చిన తెదేపా వారే తమపై దాడి చేశారంటూ వైకాపా నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని