logo

‘అనంత’కు కలిసిరాని నాయకగణం

వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్‌ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు.

Updated : 23 Apr 2024 05:18 IST

నామినేషన్‌కు హాజరు కాక నైరాశ్యం

గడియార స్తంభం వద్ద స్తంభించిన ట్రాఫిక్‌తో మండుటెండలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్‌ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. సోమవారం అనంతపురం అర్బన్‌ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడికి వచ్చిన నాయకులను చూసి వైకాపా శ్రేణుల్లో నిరాశ నిసృహలు నెలకొన్నాయి.

  • గత నెల 30న ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధం బస్సు యాత్ర రోజు పలువురు నేతలు హాజరు కాలేదు. అదే నెల 31న బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ముఖ్యమంత్రి మకాం వేసి అనంతపురానికి సంబంధించి పలువురు నేతలను పిలిపించారు. సీఎం సమక్షంలో కొందరు నేతలు మొహమాటంతో తలూపారు. మరికొందరు నేతలు బాహాటంగానే ఎమ్మెల్యే తీరుని విమర్శించారు.
  • మాజీ మేయర్‌ రాగే పరశురాంకు ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆయనకు డిప్యూటీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ పదవి ఇవ్వడంతో ఆయన అంటీ అంటనట్లు ఇటీవలే హాజరు అయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియకు పలువురు నేతలు డుమ్మా కొట్టారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన కుటుంబీకులు ఎవరూ సహకరించడం లేదు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన శివారెడ్డి, ఆయన కుమారుడు కార్పొరేటర్‌ మణికంఠారెడ్డి, ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. మైనార్టీ నేతగా గుర్తింపు పొందిన ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ నదీం అహమ్మద్‌ జగన్‌ సమక్షంలోనే ఎమ్మెల్యేని తీవ్రంగా వ్యతిరేకించారు. వైకాపా మాజీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అంబటి నారాయణరెడ్డి కుమారుడు మాజీ వైస్‌ ఛైర్మన్‌ అంబటి ఆదినారాయణరెడ్డి హాజరుకాలేదు. రెండు రోజుల కిందటే మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ సైతం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరడం వైకాపా శ్రేణులను కుంగదీసింది. ఇటీవలే ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు, ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కార్పొరేటర్‌ తెదేపాలో చేరారు.
  • అనంతపురం నగరంలో మొత్తం 50 డివిజన్లకు 46 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కో డివిజన్‌కు కనీసం 500 మంది వచ్చినా 20 వేల మందికి పైగానా హాజరు కావాల్సి ఉంది. మరీ ఇంత తక్కువ మంది వచ్చారేంటి అని వైకాపా నేతలే వ్యాఖ్యానించారు.

ఇబ్బందులేమీ పట్టవా?

నామినేషన్‌కు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌లో ప్రజలకు నరకం చూపారు. గడియార స్తంభం వద్దకు వచ్చినప్పుడు ప్రధాన రోడ్డుతోపాటు శాంతి థియేటర్‌ వైపు ఉన్న రోడ్డులో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మధ్యాహ్నం వేళ సప్తగిరి సర్కిల్‌ వద్ద నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారు ఒంటి గంట సమయంలో, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో వాహనాలు పూర్తిగా ఆపేయడంతో మండే ఎండలో విలవిలలాడారు. వైకాపా శ్రేణులు ద్విచక్ర వాహనాల్లో చిందులు వేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నా, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 అవుతున్నా గడియార స్తంభం వద్దే ఉన్న అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఎవరినీ మందలించకుండా తన కృతజ్ఞతను చాటుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని