logo

గ్రామకంఠం భూములకు ఎసరు?

ఏర్పేడు మండలం శివగిరిపల్లె సర్వే నంబరు 327లో సుమారు 10.13 ఎకరాల గ్రామకంఠం భూమిలో 2.43 ఎకరాలు శ్రీభగవాన్‌ వెంకయ్యస్వామి ఆలయం పరిధిలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు వీఆర్వో పేరుతో నకిలీ పొజిషన్‌ ధ్రువీకరణ పత్రాలు

Published : 18 Jan 2022 04:52 IST

 నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు

ఏర్పేడు మండలం శివగిరిపల్లె సర్వే నంబరు 327లో సుమారు 10.13 ఎకరాల గ్రామకంఠం భూమిలో 2.43 ఎకరాలు శ్రీభగవాన్‌ వెంకయ్యస్వామి ఆలయం పరిధిలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు వీఆర్వో పేరుతో నకిలీ పొజిషన్‌ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దీనిపై శ్రీకాళహస్తి తహసీల్దారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పలమనేరు పరిధిలో ఇటీవల ఇలాగే జరిగింది. వీఆర్వో పేరుతో నకిలీ ధ్రువపత్రం సమర్పించారని తేలడంతో ఇప్పుడా అధికారికి సమస్యలు ఎదురవుతున్నాయి.

గ్రామకంఠం భూములు కొట్టేసేందుకు కొందరు అక్రమార్కులు తెగబడుతున్నారు. కొందరు నకిలీ పొజిషన్‌ ధ్రువపత్రాలు సృష్టించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటుండగా.. మరికొందరు ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న గ్రామకంఠం భూముల సర్వే నంబర్లను వేసి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే తహసీల్దారు స్థాయి అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లకు అనుమతించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఈనాడు-తిరుపతి

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూసేకరణలు చేశారు. ఎప్పటికైనా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఈ క్రమంలో అక్కడున్న గ్రామకంఠంతోపాటు ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. ఈ భూముల సర్వే నంబర్లు సేకరించి వాటిలో ఏళ్ల తరబడి నివాసర ఉంటున్నట్లు వీఆర్వోల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు రూపొందించి.. ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తమ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుని క్రయవిక్రయాలు చేపడుతున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు, అక్కడ నివాసం ఉంటున్న అసలు యజమానుల మధ్య వాగ్వాదాలు జరిగి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత తహసీల్దార్ల దృష్టికి వస్తుండటంతో వాటిని రద్దు చేయాలని సబ్‌రిజిస్ట్రార్లకు లేఖలు రాయాల్సి వస్తోంది.

ఇంకొందరు వ్యక్తులు ఒక ప్రాంతంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రాలు తేవాలని ఒత్తిడి చేస్తుండటంతో తమకు అనుకూలమైన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకుని వాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. గ్రామకంఠం భూములే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి తమకు రిజిస్ట్రేషన్‌ చేశారని ధ్రువపత్రాలు చూపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఏర్పేడు మండలం, తిరుపతి పరిసర ప్రాంతాలు, పశ్చిమ మండలాల్లోని ప్రధాన కేంద్రాల్లో జరుగుతున్నాయి. ‘గ్రామకంఠం భూముల్లో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములకు గ్రామకంఠం పేరుతో ధ్రువీకరణ పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జేసీ రాజాబాబు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు