logo

సాంకేతిక లోపం..వసతి కష్టం

తిరుమలలోని వసతి గదుల్లో నేరుగా వచ్చే భక్తులకు కరెంటు బుకింగ్‌ కింద 2,900 గదులు కేటాయిస్తున్నారు. ఆరు ప్రాంతాల్లోని కరెంటు రిజిస్ట్రేషన్‌ కౌంటర్లలో నమోదు చేసుకొన్న భక్తుల చరవాణులకు వసతి గది కేటాయింపు వివరాలతో సంక్షిప్త సందేశాలు వచ్చేలా

Published : 24 May 2022 05:29 IST


కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్న భక్తులు 

శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే భక్తులకు వసతి కష్టాలు తప్పడం లేదు. తితిదే అమలు చేస్తున్న కరెంటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత కష్టాల పాల్జేస్తోంది. కౌంటర్ల వద్ద పేర్లు నమోదు చేసుకున్నా సాంకేతిక సమస్యలతో  గదులు దొరక్క చెట్ల కింద సేదతీరాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈటీవీ-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: తిరుమలలోని వసతి గదుల్లో నేరుగా వచ్చే భక్తులకు కరెంటు బుకింగ్‌ కింద 2,900 గదులు కేటాయిస్తున్నారు. ఆరు ప్రాంతాల్లోని కరెంటు రిజిస్ట్రేషన్‌ కౌంటర్లలో నమోదు చేసుకొన్న భక్తుల చరవాణులకు వసతి గది కేటాయింపు వివరాలతో సంక్షిప్త సందేశాలు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. తితిదే కార్యాలయంలో గది కేటాయిస్తూ పంపిన సందేశం భక్తుల ఫోన్‌కు రావడానికి రెండు నుంచి మూడు గంటలు ఆలస్యమవుతోంది. దాన్ని బట్టి భక్తులు విచారణ కార్యాలయానికి వెళ్తే అప్పటికే రెండు గంటలు దాటిపోవడంతో కేటాయింపు రద్దవుతోంది. దీంతో మరోసారి కరెంటు రిజిస్ట్రేషన్‌ కోసం భక్తులు క్యూలో నిలబడి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. సర్వర్, సాంకేతిక సమస్యలు సాకుగా చూపుతూ గదుల కేటాయింపులో ఇబ్బందులకు గురిచేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి భక్తుడు చతుర్ముఖి ఆదివారం ఉదయం ఐదు గంటలకు తిరుమల వచ్చారు. 6.40 రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దాదాపు ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం 11.39 గంటలకు సంక్షిప్త సందేశం వచ్చింది. గది కోసం రాంబగీచ విచారణ కార్యాలయానికి వెళితే  గడువు దాటిందని గది కేటాయించలేదు. ఇదే రోజు ఇలాంటి సమస్యలను హైదరాబాద్‌ నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అనంత్‌ ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని