logo

YS Jagan: వై నాట్‌ 175 అన్నారు.. రెబల్‌ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు..

వైనాట్‌ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్‌ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు.

Updated : 26 Dec 2023 08:01 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: వైనాట్‌ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్‌ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు. అయితే కుప్పంలో వైకాపా శ్రేణుల మధ్య సఖ్యత లేక తరచూ జిల్లా పెద్దల వద్దకు పంచాయితీ చేరుకుంటోంది. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి, పార్టీ మారి వచ్చిన వారికి ఛైర్మన్లుగా అవకాశం ఇస్తున్నారని.. ‘నష్ట పోయిన కార్యకర్తలు’ పేరిట అప్పట్లో వైకాపా నాయకులు సభ్యులుగా ఏర్పడి, అధికార పెద్దల వద్ద పంచాయితీ నిర్వహించడంతో వారు నచ్చజెప్పారు. ఇప్పటికే కుప్పంలో ఎమ్మెల్సీ, జిల్లా వైకాపా భరత్‌ రేసులో ఉండగా.. రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాను రెబల్‌గా పోటీ చేస్తున్నట్లు వాసనాడు మాజీ సర్పంచి మురళి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటిస్తున్నారు. కుప్పంలోని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా రోజుకొకరు బరిలో ఉంటామని ప్రకటనలు చేస్తుండటంతో అధికార పార్టీకి రెబల్స్‌ బెడదగా మారింది.

మురళి

పార్టీ నాయకులు మోసం చేశారు..: అధికారం వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆశ చూపి.. చివరికి అధికారం వచ్చిన తర్వాత సర్పంచి స్థానం కూడా కల్పించలేదని కుప్పం మండలం వాసనాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచి మురళి తెలిపారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా తరఫున సర్పంచిగా గెలుపొంది పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని, చివరికి పార్టీ అధికారం వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు మురళి వెల్లడించారు. అధికార పార్టీ నాయకులు మోసం చేశారంటూ గతంలో ‘నష్టపోయిన కార్యకర్తలు’ పేరిట పలు కార్యక్రమాలు కుప్పం ప్రాంతంలో చేసినట్లు వివరించారు. అప్పట్లో స్థానికంగా కష్టపడిన నాయకులను గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీ అభ్యున్నతికి తాము కష్టపడ్డామని చెప్పారు. కుప్పం వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించాలని అప్పట్లో జిల్లా స్థాయి నాయకులను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని