logo

ఆపత్కాలం.. అందని వైద్యం

వైద్యం జిల్లా పరిధిలో ఇటీవల వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలమీదకు వస్తోంది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి

Published : 10 Aug 2022 06:13 IST

ఆసుపత్రిలో మూసి ఉన్న ట్రామాకేర్‌ వార్డు

కోరుకొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తలకు గాయం కావడంతో ప్రథమ చికిత్స చేయించి రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరో సర్జన్‌ సేవలు అవసరం కావడంతో ఇక్కడ వైద్యుడు లేరు. సంబంధిత వైద్యుడు కాకుండా మరో స్పెషాలిటీ వైద్యుడు సేవలందిస్తుండడంతో కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేశారు.

నగరంలోని లాలాచెరువు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్రవాహనంపై జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమహేంద్రవరం వైద్యశాలకు తరలించారు. తలకు గాయం కావడంతో అతనికి ప్రథమ చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం: వైద్యం జిల్లా పరిధిలో ఇటీవల వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలమీదకు వస్తోంది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికి ప్రత్యేక వైద్యం అందేలా 2010లో ఏర్పాటు చేసిన ట్రామాకేర్‌ సేవలు మూలకు చేరాయి. దీంతో తలకు తీవ్ర గాయాలతో వచ్చేవారికి ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు పంపేస్తున్నారు. దీంతో కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతుంటే, నిరుపేదలు చేసేదిలేక కాకినాడ వెళ్లి చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యకళాశాల బోధనాసుపత్రిగా మారినా పూర్తిస్థాయిలో సేవలు అందడానికి మరొక ఏడాది పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రామాకేర్‌ సెంటర్‌ సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

వసతులున్నా వైద్యుల్లేరు..
రాజమహేంద్రవరం ఆసుపత్రిలో 15 పడకలతో ట్రామాకేర్‌ విభాగానికి అత్యాధునిక సదుపాయాలు, వసతులు కల్పించడంతోపాటు అప్పట్లో 11 మంది వైద్యులు, 21 మంది నర్సులతోపాటు మరో 43 మంది ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం వైద్యుడు, స్టాఫ్‌ నర్సులు, ఈసీజీ టెక్నీషియన్‌, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితర విభాగాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. ఇందులో ప్రస్తుతమున్న 25 మంది సిబ్బందిని ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో వినియోగిస్తున్నారు. ఎనిమిది నెలలకోసారి వేతనాలు ఇస్తుండడంతో ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రామాకేర్‌ వార్డు మూసి ఉంచడంతో లోపల పరికరాలు దెబ్బతింటున్నాయి. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో పది మంది సీఎంవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రామాకేర్‌లో వైద్యులను భర్తీ చేసినా ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలకు ఆటంకం లేకుండా ఉంటుందని రోగులు కోరుతున్నారు.

మూతపడిన విభాగం
జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆసుపత్రుల్లో ట్రామాకేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన గంటలోపే వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందించడంతోపాటు ప్రాణనస్టాన్ని నివారించేలా కేంద్రం ప్రభుత్వం 2010లో చర్యలు చేపట్టింది. అయిదేళ్లు పూర్తిస్థాయిలో సేవలందినా తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. అప్పటి నుంచి వైద్యసేవలందడం లేదు. దీంతో ప్రమాదాల్లో గాయపడిన వారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రైవేటు ఆసుపత్రులు, కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటోంది.

మూలకు చేరిన సీటీ స్కాన్‌
రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారికి సీటీ స్కాన్‌ తీసేవారు. రెండేళ్ల నుంచి ఈ యంత్రం కూడా మూలకు చేరింది. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మోక్షం లభించలేదు. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.1.30 కోట్ల వ్యయంతో యంత్రాన్ని కొనుగోలు చేయాలని చూసినా నేటికీ కొలిక్కి రాలేదు.

అధికారుల మాటిదీ..
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యకళాశాల, బోధనాసుపత్రిగా మారడంతో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆసుపత్రి ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీ పవర్‌గ్రిడ్‌ కంపెనీ నుంచి సిటీ స్కాన్‌ యంత్రం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని