logo

మొరాయించిన సమీకృత హాజరు యాప్‌..

రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా మంగళవారం నుంచి విధిగా తొమ్మిది గంటల్లోగానే హాజరు వేయాలి. అది కూడా కొత్తగా రూపొందిన సిమ్స్‌ యాప్‌లోనే ముఖచిత్ర పద్ధతిలో నమోదు చేయాలి..

Published : 17 Aug 2022 06:14 IST

ఉపాధ్యాయులకు పరీక్షగా మారిన సర్వర్లు

అద్దంపల్లిలో ఉదయం 8.35 నుంచి హాజరు వేయడానికి పాట్లు

న్యూస్‌టుడే, పామర్రు, మండపేట: రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా మంగళవారం నుంచి విధిగా తొమ్మిది గంటల్లోగానే హాజరు వేయాలి. అది కూడా కొత్తగా రూపొందిన సిమ్స్‌ యాప్‌లోనే ముఖచిత్ర పద్ధతిలో నమోదు చేయాలి.. లేకపోతే అర్హత ఉన్న సెలవుగా డీడీవో పరిగణిస్తారని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు కావడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. తొలుత ఉపాధ్యాయులంతా తమ చరవాణిలో సంబంధిత యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలి. తరువాత వీరిని ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్లో రిజిస్టరు చేయాలి  పలువురికి మంగళవారం ఉదయానికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఏదోలాగ పాట్లు పడి చాలా మంది రిజిస్టరు చేశారు. మంగళవారం ఉదయం అన్ని పాఠశాలల్లో కూడా ఉదయం 8.35 నుంచే ఉపాధ్యాయులు కొత్త సమీకృత యాప్‌లో హాజరు వేయడానికి ప్రయత్నించారు. 8.30 గంటలకు ప్రయత్నించిన కొంత మందికి అయ్యిందని తరువాత ఎవరికీ అవ్వలేదని చెబుతున్నారు. ఓ పక్క ఉపాధ్యాయ సంఘాలు, ఫ్యాప్టో నాయకులు ఈ యాప్‌ను ఉపాధ్యాయులు డౌన్లోడ్‌ చేసుకోవద్దని చెప్పారు. అయినా కూడా చాలా మంది హాజరు వేయడానికే మొగ్గు చూపి ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు. సుమారు అరగంట పైగా ఎంతో సహనంతో పలు రకాలుగా ప్రయత్నించామని, కొత్త యాప్‌లో హాజరు నమోదు కాలేదని ఉపాధ్యాయులు చెప్పారు. పాత రిమ్స్‌ యాప్‌లో వేద్దామనుకున్నా అది కూడా సరిగా పని చేయలేదని చెప్పారు. యాప్‌లను సరిగా రూపాందించాలని, తగిన సర్వర్లును ఏర్పాటు చేయాలని అలా చేయలేని పక్షంలో ఎప్పటికీ ఈ పాట్లు తమకు తప్పవని అంటున్నారు. ఇది పరోక్షంగా బోధన మీద కూడా ప్రభావం చూపుతుందని విశదపరుస్తున్నారు.

సాంకేతిక ఇబ్బందులు సరిచేస్తారు..
కొత్త సమీకృత యాప్‌లో మంగళవారం నుంచి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును కచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్నారు. ఇంకా కొంత మంది ఇన్‌స్టాల్‌ చేసుకోకపోవడం, డీడీవోలు రిజిస్టరు చేయకపోవడం జరిగింది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ బుధవారం ఉదయానికి తప్పకుండా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఉపాధ్యాయుల నమోదులో ఎంఈవోలు, హెచ్‌ఎంలు అలసత్వం ప్రదర్శించవద్దు. తొలిరోజు యాప్‌ సర్వర్‌ సామర్థ్యం తక్కువగా ఉండడం, యాప్‌ వాడే చరవాణి అంతర్జాల వేగం అంతగా ఉండక పోవడం, క్యాప్చా వేలిడేషన్‌ కాలంతో జతకాకపోవడం తదితర కారణాలతో యాప్‌ పనిచేయలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖకు తెలియచేశాం. యాప్‌ నిర్వహిస్తున్న  టీసీఎస్‌ అధికారులతో మాట్లాడి సాంకేతిక ఇబ్బందులు సరిచేస్తామన్నారు. ఉపాధ్యాయులకు సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా యాప్‌ను మెరుగు దిద్దుతాం. అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. -ఎన్‌.వి.రవిసాగర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని