logo

తేల్చుడులేదు.. నాన్చుడే!

‘‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా.. పోలీస్‌’’ ..ప్రజాహితాన్ని కాంక్షించి..

Updated : 05 Dec 2022 12:41 IST

ఈనాడు - రాజమహేంద్రవరం

‘‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా.. పోలీస్‌’’ ..ప్రజాహితాన్ని కాంక్షించి.. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ.. అక్రమాలు అరికట్టి.. శాంతిభద్రతలు కాపాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అన్యాయాన్ని ప్రతిఘటించే ప్రతి పోలీసుకూ ఈ వ్యాఖ్యలు సరిపోతాయి.. కానీ కాస్తోకూస్తో నిజాయతీగా పని చేద్దామనుకుని బాధ్యతలు చేపట్టిన వారి ముందరి కాళ్లకు రాజకీయ ఒత్తిళ్లతో బంధం వేస్తూ విచారణను నీరుగారుస్తున్నారు. వెరసి బలమున్నోడికో న్యాయం.. సామాన్యుడికో న్యాయం అన్నట్లుగా వ్యవహారం తయారైంది. ఓ నాయకుడు మట్టి లారీతో తొక్కించేస్తానని.. ఇంకో నాయకుడు భూమిలో కప్పెట్టేస్తానని హెచ్చరిస్తే.... మరో నాయకుడు ఏకంగా చంపేస్తానని బాహాటంగా బెదిరించిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసినా పోలీసులు కనీసం స్పందించే సాహసం చేయడంలేదు. ప్రజాప్రతినిధులు, నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలున్న కీలక కేసులు కొలిక్కిరాని దయనీయమిది.


అనంత దారుణాలు చూడరే..

 

 

ఈ ఏడాది మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఈ కేసులో నేటికీ పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ పోలీసులు దాఖలు చేయలేదు. లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానం ముందు చెబుతున్నా.. ఆ దిశగా పురోగతి లేదు. కీలకమైన సెల్‌టవర్‌ లొకేషన్‌, ఇతర నిందితుల జాడే లేదు. డ్రైవర్‌ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మే 23న అరెస్టు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల వైఫల్యాన్ని సాకుగా చూపి నిందితుడు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుంటే.. పోలీసులు మాత్రం విచారణ కొలిక్కి తేలేకపోతున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులు గవర్నర్‌ను కలిసి కేసు సీబీఐకి అప్పగించి అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని కోరడంతోపాటు.. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు.


రాజకీయ జోక్యంతో అలజడి..

 

 

అల్లర్లలో దహనమైన బస్సు

కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో రాజకీయ జోక్యం అమలాపురాన్ని రణరంగంగా మార్చేసింది. మే 24 నాటి అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలతోపాటు ప్రభుత్వ ఆస్తులనూ ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 256 మందిని పోలీసులు అరెస్టుచేశారు. అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఓ కీలక నాయకుడి కుమారుడు ఓ ప్రజాప్రతినిధిని చంపేస్తానని బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లకు బెదిరి కనీసం వీటిపై విచారణకూ సాహసించలేదు. అమలాపురం అల్లర్ల కేసులో అన్ని పార్టీల వారి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించినా.. కుట్రకు సూత్రధారి ఎవరనేది నేటికీ తేల్చలేకపోయారు.


ప్రాణం పోయినా పట్టింపేది?

 

 

మా ఇల్లు పడగొట్టేశారు.. మా బిడ్డలను మాకు కాకుండా చేస్తున్నారు.. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. మీకో దండం.. పురుగుల మందు తాగి చస్తున్నామని సెల్ఫీ వీడియో తీసుకుని బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన తల్లీకొడుకు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ నవంబరు 14న ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా నాయకుల వేధింపులే కారణమని బాధితులు, బాధిత కుటుంబికులు అప్పట్లో ఆరోపించారు.

పురుగు మందు తాగిన వారిలో తల్లి కామాక్షి మృత్యువాత పడితే.. కొడుకు ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుటపడలేదు. ఇంత బాహాటంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చాటినా.. ఆ నలుగురే కారణమంటూ పేర్లు చెప్పి మరీ ఆరోపించినా.. ఆ వారిని కనీసం ప్రశ్నించే సాహసం పోలీసులు చేయలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


గతితప్పుతోంది...

 

 

రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత (పాత చిత్రం)

కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూ.గో. జిల్లాల్లో ఇటీవల వివాదాస్పదమైన కీలక కేసుల్లో రాజకీయ ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతలు గతితప్పడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం ఏంటన్న ఆక్షేపణ వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరంలో అమరావతి రైతుల పాదయాత్రపై దాడి కేసులో రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై నేటికీ కదలిక లేదు.. బీ రామచంద్రపురంలో రథం నుంచి హార్డ్‌డిస్క్‌ల స్వాధీనం వ్యవహారంపైనా స్పష్టత లేదు. అల్లర్లకు, శాంతిభద్రతలు గతితప్పడానికీ నిఘా వ్యవస్థ సమర్థంగా లేకపోవడం.. ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసిన కేసుల్లోనూ పురోగతి కనిపించని పరిస్థితి పోలీసుల పనితీరునే ప్రశ్నిస్తోంది.


దాడి చేసినా దాపరికమే

 

 

భవానీ భక్తుడిలా వచ్చి తునికి చెందిన తెదేపా సీనియర్‌ నేత పోల్నాటి శేషగిరిరావుపై కత్తితో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. హత్యాయత్నం కుట్ర వైకాపా నాయకులదే అని తెదేపా నాయకులు ఆరోపిస్తుంటే.. భూవివాదాలు, ఆర్థిక లావాదేవీ విషయంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని వైకాపా నాయకులు అంటున్నారు. కేసు విచారణపై భిన్నస్వరాలు వినిపిస్తున్నా.. నిజాలేంటో పోలీసుల విచారణలో తేల్చాల్సి ఉంది. శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పెద్దాపురం డీఎస్పీ మురళీమోహన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సాక్ష్యాల సేకరణతోపాటు.. ఇతర నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తి అనకాపల్లి జిల్లా నామవరం ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని