logo

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పొగాకు పరిశోధనలు

స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే పొగాకు వంగడాల కోసం విస్తృతంగా పరిశోధనలు సాగాలని, ఆ దిశగా కృషి జరుగుతోందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌, దిల్లీ) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(క్రాప్‌ సైన్సు) టి.ఆర్‌.శర్మ తెలిపారు.

Published : 28 Jan 2023 03:05 IST

ఏఐఎన్‌పీటీ వార్షిక నివేదికను ఆవిష్కరిస్తున్న ఐసీఏఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ శర్మ, సిటీఆర్‌ఐ డైరెక్టర్‌ శేషుమాధవ్‌ తదితరులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే పొగాకు వంగడాల కోసం విస్తృతంగా పరిశోధనలు సాగాలని, ఆ దిశగా కృషి జరుగుతోందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌, దిల్లీ) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(క్రాప్‌ సైన్సు) టి.ఆర్‌.శర్మ తెలిపారు. ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలో అఖిల భారత పొగాకు నెట్‌వర్క్‌ ప్రాజెక్టు(ఏఐఎన్‌పీటీ)పై రెండు రోజులపాటు జరిగే జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ(సీటీఆర్‌ఐ)లో ప్రారంభమైంది. సీటీఆర్‌ఐ డైరెక్టర్‌, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎం.శేషుమాధవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పొగాకు ఉత్పత్తులను పెంచే దిశగా, ఉత్పత్తి-డిమాండ్‌ మధ్య వ్యత్యాసాన్ని అధిగమించేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు. పొగాకు పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తేవాలని, వాతావరణ ప్రతికూలతలు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రూపొందించడంలో కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. పొగాకు క్యూరింగ్‌ కోసం శక్తి వనరుగా సౌరశక్తిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా కట్టెల వాడకంపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. పొగాకుతోపాటు ఇతర వాణిజ్య పంటలైన పసుపు, మిరప, ఆముదం, ఆశ్వగంధలో పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులు, విలువ జోడింపుపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ శేషుమాధవ్‌ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏటా సుమారు రూ.28 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందన్నారు. సమావేశంలో ఐసీఏఆర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌(కమర్షియల్‌ క్రాప్‌) ఆర్‌కే సింగ్‌, ఆలిండియా నెట్‌వర్క్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. వివిధ సాంకేతిక సెషన్లకు సబ్జెక్టు నిపుణులు ఆర్‌.లక్ష్మీనారాయణ, వి.ఆర్‌.ఎం.రావు, జేఏవీ ప్రసాదరావు, యు.శ్రీధర్‌ అధ్యక్షత వహించారు. 12 పరిశోధన ప్రచురణాలను విడుదల చేశారు. తొలిరోజు సమావేశంలో ఏఐఎన్‌పీటీకి చెందిన 14 కేంద్రాల శాస్త్రవేత్తలు, విభాగాధిపతులు, ఐసీఏఆర్‌, సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని