logo

ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు

జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉండగా వీరిలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Published : 20 Mar 2023 05:33 IST

ప్రమాద చిత్రం

తుని పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉండగా వీరిలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం డిపోకు చెందిన బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తోంది. రాజమహేంద్రవరం వరకు ఒక డ్రైవర్‌ నడపగా ఆ తర్వాత మరొకరు మారారు. తెల్లవారుజాము 4.10 గంటల సమయంలో తుని డిపోకు వేగంగా వస్తూ అదుపుతప్పి జాతీయ రహదారి, సర్వీసు రోడ్డుకు మధ్య ఉన్న డివైడర్‌ను ఢీకొని కొంతదూరం వెళ్లి సర్వీసు రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనతో గాఢనిద్రలో ఉన్న ప్రమాణికులు ఒక్కసారిగా తుళ్లిపడ్డారు. వెంటనే తేరుకున్న డ్రైవర్లు ప్రయాణికులను బస్సు ముందుభాగం నుంచి బయటకు తెచ్చారు. 108కు సమాచారం అందించారు.

క్షతగాత్రులు వీరే..

విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద తుమరాడకు చెందిన ఎన్‌.అప్పన్న, వై.సింహాచలం, ఎ.సుబ్రహ్మణ్యం, జి.కల్యాణి, విశాఖపట్టణానికి చెందిన ఎం.ఎస్‌.అయ్యంగార్‌, రామలక్ష్మి గాయపడ్డారు. వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం అందించారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి పంపారు. డిపో మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మురళీమోహన్‌ తెలిపారు.

ప్రమాదానికి కారణమిదేనా?

తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. ఆ సమయంలో సర్వీసు రోడ్డులోకి వచ్చే డివైడర్‌ సరిగ్గా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని