logo

డీజిల్‌ మాయాజాలం..?

కాకినాడ కార్పొరేషన్‌లో డీజిల్‌ బిల్లులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న వాహనాలకు నెలవారీ బిల్లులు అధికంగా చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 27 Mar 2023 05:44 IST

కాకినాడ కార్పొరేషన్‌ డిపోలో వాహనాలు

న్యూస్‌టుడే, బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడ కార్పొరేషన్‌లో డీజిల్‌ బిల్లులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న వాహనాలకు నెలవారీ బిల్లులు అధికంగా చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలకు రూ.10 లక్షల వరకు అదనంగా సమర్పిస్తున్నట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ప్రతీ నెలా ఆయా వాహనాలకు రూ.20 లక్షల వరకు ఇంధనం ఖర్చవుతుండగా రూ.30 లక్షల వరకు బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా ఉండగా నెలకు రూ.20 లక్షల వరకు డీజిల్‌ ఖర్చులు చూపేవారు. గత ఏప్రిల్‌లో ఆయన బదిలీపై వెళ్లడంతో అప్పటి నుంచి నెలకు రూ.30 లక్షల చొప్పున బిల్లులు సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పద్దుల విభాగం అధికారులు కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. గత పది నెలల కాలంలో సమర్పించిన బిల్లులపై విచారణకు ఆయన ఆదేశించారు. వాహనాల లాగ్‌బుక్‌లు, బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య విభాగంలోని ప్రతీ వాహనం రోజూ ఎన్ని కిలోమీటర్ల దూరం తిరిగింది.. ఎంత డీజిల్‌ ఖర్చయ్యింది.. ఆయా వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తున్న బంకులో నమోదుచేసిన వివరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేశారు. ఈ 10 నెలల కాలంలో దాదాపు రూ.కోటి వరకు అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కార్పొరేషన్‌ వాహనాలను ఏడాది కాలంలో ఏ అధికారి పర్యవేక్షంచారు, ప్రతీ నెలా ఎంతెంత బిల్లులు సమర్పించారనే విషయాలపై విచారణ చేపట్టారు. నగరంలో ఇంటింటా చెత్త సేకరణకు 108 హూపర్‌ టిప్పర్‌ వాహనాలను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇవి కాకుండా పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న సొంత వాహనాలు, ట్రాక్టర్లు, కాంపెక్టర్లు, జేసీబీలు, ఇతర వాహనాలకు వినియోగించిన ఇంధన బిల్లులపై మళ్లీ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే రూ.కోటి వరకు బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉండగా వీటిని మంజూరు చేసేలోగా కార్పొరేషన్‌ పద్దుల విభాగానికి సమర్పించిన బిల్లులపై శల్య శోధన చేయనున్నారు. కార్పొరేషన్‌లో వాహనాలకు వినియోగిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌పై థర్డ్‌ పార్టీతో విచారణ చేయిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ సొంత  వాహనాల పరిస్థితి..

కార్పొరేషన్‌కు సొంతంగా 52 వాహనాలున్నాయి. వీటిలో 18 ట్రాక్టర్లు, 15 కాంపెక్టర్లు, నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీ, ఒక బుల్‌, ఒక బ్లేడ్‌ తదితర వాహనాలను నగరంలోని 14 సర్కిళ్ల పరిధిలో వాడుతున్నారు. ఆయా వాహనాలకు స్థానికంగా ఓ పెట్రోల్‌ బంకు నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఏ వాహనం ఎక్కడ పనిచేసింది.. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎన్ని లీటర్ల డీజల్‌ ఖర్చయిందనే వివరాలను లాగ్‌బుక్‌లో రోజూ నమోదు చేస్తారు. దీని ఆధారంగానే ప్రతీ నెలా బిల్లులు సమర్పిస్తారు. ఈ విభాగాన్ని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షిస్తారు. ఏడాది కాలంలో ఇద్దరు పనిచేశారు.


జీపీఎస్‌  అటకెక్కింది..

నగర పరిధిలోని వినియోగించే వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చారు. వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టం అమలు చేస్తున్నారు. దీన్ని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)కి అనుసంధానం చేశారు. గతేదాడి మార్చి నుంచి ఇది పనిచేయడంలేదు. నిర్వహణ సంస్థ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి నుంచి కార్పొరేషన్‌ సొంత వాహనాలకు జీపీఎస్‌ పరికరాలున్నా అవెక్కడున్నానే పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కారణంగా గతేడాది మార్చి నుంచి ఇష్టారాజంగా బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. ఐసీసీసీ మనుగడలో లేకపోవడం అక్రమాలకు తావిచ్చినట్లయింది.


ఏళ్ల తరబడి  ఒకటే బంకు..

కార్పొరేషన్‌ పరిధిలోని సొంత వాహనాలకు స్థానికంగా ఓ పెట్రోలుబంకు నుంచే కొన్నేళ్లుగా డీజిల్‌, పెట్రోలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐఏఎస్‌ కమిషనర్‌ తప్పుబట్టారు. నగరంలోని 14 శానిటేషన్‌ సర్కిళ్ల పరిధిలో ఏడు సర్కిళ్లకు పాత ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోలుబంకు, మిగిలిన ఏడు సర్కిళ్లలోని వాహనాలకు స్థానిక కల్పన కూడలిలోని బంకులో డీజల్‌, పెట్రోలు తీసుకోవాలని నిర్ణయించి, అమలు చేశారు. ఇది ఎంతోకాలం నిలవలేదు. రాజకీయ పైరవీలతో మళ్లీ పాత పెట్రోల్‌ బంకు నుంచే ఆయిల్‌ కొనుగోలు చేసుకునేలా ఒత్తిడి తెచ్చిన కొందరు సఫలీకృతమయ్యారు.


ఫాగింగ్‌ యంత్రాలదీ  అదే దారి..?

కార్పొరేషన్‌ పరిధిలో 24 ఫాగింగ్‌ యంత్రాలున్నాయి. ప్రతీ నెలా రూ.8 లక్షల వరకు డీజిల్‌, పెట్రోల్‌ బిల్లులు పెడుతున్నా ఇవి నగరంలో ఎక్కడా తిరిగినట్లు కనిపించడం లేదు. కార్పొరేషన్‌ స్పందనలోనూ దోమల బెడదపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించకపోయినా, బిల్లులు మాత్రం యథావిధిగా సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫాగింగ్‌, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు రసాయనాలు, సామగ్రిని సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌ ఓ స్టోర్‌ నిర్వహిస్తోంది. ఏటా ఇక్కడ రూ.కోటికి పైగా నిధులు వెచ్చిస్తున్నారు. దీనిపైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులే చెబుతున్నారు.


విచారణకు  ఆదేశించాం..
- కె.రమేశ్‌, కమిషనర్‌, కాకినాడ కార్పొరేషన్‌

పారిశుద్ధ్య వాహనాల బిల్లుల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. గత ఏడాది కాలంలో బిల్లులపై అన్ని కోణాల్లోనూ తనిఖీ చేస్తాం. ప్రతీ బిల్లును సునిశితంగా పరిశీలిస్తాం. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అత్యవసరం కావడంతో స్థానికంగా బిల్లుల సొమ్ములు సర్దుబాటు చేస్తున్నాం. కొంత కాలంగా ఈ బిల్లులు ఎక్కువగా ఎందుకు సమర్పిస్తున్నారనే విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తాం. మరోవైపు కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని వాహనాల నిర్వహణపై నిఘా పెడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని