logo

జనగోదారి.. సమర భేరి

తెలుగు దండు కదిలివచ్చింది. ఎండైనా... వానైనా... అడ్డంకులు ఎదురైనా... అన్నీ దాటుకుంటూ మహానాడు బహిరంగసభకు తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన జనంతో వేమగిరిలోని ప్రాంగణం జనసంద్రమైంది. ఉదయం నుంచి భానుడు భగభగలతో భయపెట్టినా... సాయంత్రానికి వరుణుడు కురిపించిన జల్లులను అంతా ఆస్వాదించారు.

Updated : 29 May 2023 05:31 IST

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్‌టుడే, కాకినాడ నగరం, పిఠాపురం, జగ్గంపేట ఈనాడు- రాజమహేంద్రవరం, కాకినాడ

తెలుగు దండు కదిలివచ్చింది. ఎండైనా... వానైనా... అడ్డంకులు ఎదురైనా... అన్నీ దాటుకుంటూ మహానాడు బహిరంగ సభకు తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన జనంతో వేమగిరిలోని ప్రాంగణం జనసంద్రమైంది. ఉదయం నుంచి భానుడు భగభగలతో భయపెట్టినా... సాయంత్రానికి వరుణుడు కురిపించిన జల్లులను అంతా ఆస్వాదించారు. అధినేత ఉత్సాహ పూరిత ప్రసంగాన్ని మదినిండా నింపుకొని వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామంటూ తిరుగుపయనమయ్యారు.

చారిత్రక నగరిలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. మహా సంబరం అంబరాన్ని తాకింది. తెదేపా అధినాయకత్వం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవం.. మహానాడు వేడుక ఆదివారంతో పరిపూర్ణమయ్యింది. గోదావరి తీరాన జన జాతరలో.. శకపురుషుని శతజయంతి వేడుక అట్టహాసంగా సాగింది. మహానాడు వేదికగా ప్రజాహితమే నినాదంగా.. అభివృద్ధే అజెండాగా ఎన్నికల సంగ్రామానికి తెదేపా అధినేత చంద్రబాబు సమర శంఖం పూరించారు. తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.  

ఎండలు మండుతున్నా..  

ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయనే హెచ్చరికలున్నా.. గుండెల నిండా అభిమానంతో మహానాడుకు అభిమాన జనం పోటెత్తారు. జెండాలు చేతపట్టుకుని పార్టీకి జై కొడుతూ ముందుకు సాగారు. కొందరు కాలినడకన.. ఇంకొందరు ఆటోల్లో, ప్రైవేటు వాహనాల్లో మహానాడు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. తొలిరోజు ప్రతినిధుల సభ జరిగిన ప్రాంగణంలోనే వచ్చిన ప్రతి ఒక్కరికీ కడుపు నిండా వివిధ రుచులతో భోజనం పెట్టించారు. 

గుండెల్లో గోదారి..

ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయా నియోజకవర్గ బాధ్యుల సారథ్యంలో లక్షలాది మంది వరకు రాజమహేంద్రవరం వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహన ర్యాలీలు, ఆటోలు, కార్లు, ప్రైవేటు బసుల్లో తరలివచ్చారు. వడగాడ్పులు వీయడంతో ముందస్తుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఎనిమిది మంది వడదెబ్బకు గురవ్వడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోవడంతో ప్రాథమిక వైద్యం అందించి వైద్యశాలకు తరలించారు.

అడుగడుగునా అడ్డంకులే..

మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరించడంతో అధిక సంఖ్యలో అభిమానులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. పలు జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలపై రాజమహేంద్రవరం వచ్చారు. తొలిరోజు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో విఫలమైన పోలీసులు.. రెండోరోజు జిల్లా ముఖ ద్వారాల వద్ద, పలుచోట్ల ట్రాఫిక్‌ పేరుతో కట్టడి చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఆత్మీయ వీడ్కోలు

మహానాడుకు వచ్చిన లక్షల మంది కోసం 10 లక్షల నీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే కార్యకర్తల కోసం తొమ్మిదిచోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ఆహార పొట్లాలు అందించారు. ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని చంద్రబాబు, లోకేశ్‌లు శ్రేణులకు సూచించారు.


ఎన్టీఆర్‌ ముత్తాత... చంద్రబాబు తాత

తిరుపతికి చెందిన టి.చిరంజీవి, రేవతి దంపతులు నాలుగేళ్ల కుమారుడు అనిల్‌కుమార్‌తో మహానాడుకు వచ్చారు. ఎన్టీఆర్‌ ముత్తాత... చంద్రబాబు తాత అంటూ అనిల్‌ ముద్దులొలికే మాటలు చెబుతూ వారిద్దరిపై పాట ఆలపించాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయం తథ్యమని ఈ దంపతులు చెప్పారు.


మనోహరం

చీరాలకు చెందిన మనోహర్‌ తెదేపా వీరాభిమాని. ఎక్కడ మహానాడు జరిగినా ఇలా తెదేపా రంగుల దుస్తులు, ఎన్టీఆర్‌ బొమ్మలను కిరీటంగా ధరించి హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే 41 మహానాడు వేడుకల్లో పాల్గొన్నానన్నారు.


బాబును గెలిపించుకుంటాం...

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మహిళలు మహానాడు ప్రాంగణం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అభివృద్ధి అనేదే లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే మహానాడుకు వచ్చామన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేసి చంద్రబాబును గెలిపించుకుంటామన్నారు.


వయోభారమైనా వడివడిగా...

ల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన దొండపాటి నారాయణ వయసు 80 సంవత్సరాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పార్టీ అంటే ఎనలేని అభిమానం. వృద్ధాప్యంలోనూ ఆయన మహానాడుకు తరలివచ్చారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ ఓటమి తథ్యమని, చంద్రబాబు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


ప్రతీ గురువారం ఎన్టీఆర్‌కు నివాళి

యన పేరు కేశేపల్లి సాంబశివరావు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 72 ఏళ్లు. తాను ఎన్టీఆర్‌ అభిమానినని, 1974 నుంచి తారకరామ అసోసియేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1996లో ఎన్టీఆర్‌ మహాభినిష్క్రమణం తరువాత గుంటూరు ఆటో స్టాండ్‌ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ప్రతీ గురువారం పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. గత 27 ఏళ్లలో తాను ఈ కార్యక్రమాన్ని ఒక్క వారం కూడా ఆపలేదని సాంబశివరావు తెలిపారు.


చంద్రన్నను మరిపించేలా...

చంద్రబాబు రూపంలో నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అనే అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతనితో సెల్ఫీలు దిగేందుకు మహానాడుకు వచ్చిన జనం ఆసక్తి చూపారు.


ఉరిమిన ఆకాశం.. ఉప్పొంగిన అభిమానం..

దివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. హోరుగాలి, జోరువాన ఇబ్బందిగా మారింది. ప్రాంగణంలోని హోర్డింగులు, ఫ్లెక్సీలు, మహానాడు వేదిక ఎదురుగా టెంట్లు కూలిపోయాయి. రాకపోకలు స్తంభించాయి.. దీంతో కొందరు చెల్లాచెదురైనా.. మిగిలినవారంతా  హోరుగాలులతో కళ్లలోకి మట్టి చెలరేగుతూ ఇబ్బంది పెడుతున్నా.. వాన కుదిపేస్తున్నా ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కావాలనే కాంక్షతో కుర్చీలు, ఫ్లెక్సీలు అడ్డుపెట్టుకుని అక్కడే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక ప్రాంగణం వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.


ప్రాణాలకు తెగించి.. 300 మందిని కాపాడి..

భారీ గాలులు, వర్షం కురవడంతో సభ వద్ద ఫ్లడ్‌లైట్ల స్తంభం పడిపోబోతుంటే ఏలూరు జిల్లా పట్టిసీమకు చెందిన బావమరుదులు విజయ్‌, నాగరాజు దాన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ సుమారు 300 మంది కూర్చోగా... వెళ్లిపోమని గట్టిగా అరిచారు. విద్యుత్తు స్తంభం తీగల రాపిడికి నిప్పురవ్వలు ఎగసి పడటంతో ప్రమాదం జరుగుతుందని దాన్ని పక్కకు వదిలేశారు. ఈ క్రమంలో వారు  గాయపడగా విజయ్‌కు 13 కుట్లు, నాగరాజ్‌కు ఏడు కుట్లు పడ్డాయని, ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉండటంతో వాళ్ల ఇంటికి తరలించామని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని