పసిడికాంతుల పట్టాభిషేకం
మది నిండా అధ్యయన ఫలాలు.. కళ్లల్లో పసిడి కాంతులు.. పిల్లలను చూసి పెద్దల ఆనందబాష్పాలు.. వీడలేమంటూ.. వీడ్కోలంటూ సహచరుల ఆప్యాయతలు, తల్లిదండ్రుల అభినందనలు.. ఆచార్యుల ఆశీర్వాదాలు.. ఇలా ఓ అపురూప ఘట్టానికి వేదికైంది కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే). బుధవారం ఈ వర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.
అనిల్ చలమలశెట్టికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. చిత్రంలో మంత్రి బొత్స
ఈనాడు, కాకినాడ; న్యూస్‌టుడే, వెంకట్‌నగర్: మది నిండా అధ్యయన ఫలాలు.. కళ్లల్లో పసిడి కాంతులు.. పిల్లలను చూసి పెద్దల ఆనందబాష్పాలు.. వీడలేమంటూ.. వీడ్కోలంటూ సహచరుల ఆప్యాయతలు, తల్లిదండ్రుల అభినందనలు.. ఆచార్యుల ఆశీర్వాదాలు.. ఇలా ఓ అపురూప ఘట్టానికి వేదికైంది కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే). బుధవారం ఈ వర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.
వినూత్న ఆలోచనలతోనే విజయం
జీవిత లక్ష్యాలు నిర్దేశించుకుని.. వినూత్న ఆలోచనలకు పదును పెట్టి.. విజయం సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం- కాకినాడ (జేఎన్‌టీయూకే) తొమ్మిదో స్నాతకోత్సవంలో బుధవారం ఆయన కులపతి హోదాలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థికి వృత్తిపరమైన నైపుణ్యం అవసరమన్నారు. ఇంజినీరింగ్ కెరీర్‌లో విజయాన్ని ఒక్కరోజులో సాధించలేరని.. నిబద్ధతతో ప్రయత్నిస్తే ఏరోజుకైనా అందుకుంటారన్నారు. ప్రతి సమస్యను సవాలుగా తీసుకుని జీవితంలో నేర్చుకోడానికి, ఎదగడానికి అవకాశంగా మలచుకోవాలన్నారు. ఏ రంగంలో ఉన్నా సమాజానికి సేవ చేస్తేనే సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని గవర్నర్ సూచించారు. భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలిసారి చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఎస్‌ఎల్‌వి-3 విఫలమైందని, వైఫల్యం గురించి ఆలోచిస్తూ కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించారని గుర్తుచేశారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పీహెచ్‌డీలు, స్టార్టప్‌లతో పాటు సాంకేతికత, ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానాల్లోనూ భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. గత పదేళ్లలో పరిశోధన- అభివృద్ధిపై స్థూల వ్యయం మూడు రెట్లు పెరిగిందన్నారు. రెసిడెంట్ పేటెంట్ల ఫైలింగ్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు వివరించారు.
ఎవరెవరు పాల్గొన్నారంటే..
మంత్రులు దాడిశెట్టి రాజా, విశ్వరూప్, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికాశుక్లా, ఎస్పీ సతీష్‌కుమార్, నన్నయ విశ్వవిద్యాలయం వీసీ పద్మరాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కన్నబాబు, పెండెం దొరబాబు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, కుడా ఛైర్మన్ చంద్రకళాదీప్తి, చలమలశెట్టి సునీల్, జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. - జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా గ్రీన్‌కో గ్రూప్ సీఈవో- ఎండీ అనిల్ చలమలశెట్టి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఐటీ, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, అర్బన్ ఇన్‌ఫ్రా రంగాల్లో సాంకేతికత ఆధారంగా విజయం సాధించినందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. - వేదికపై 133 మంది పీహెచ్‌డీలు, 53 మంది 66 బంగారు పతకాలు స్వీకరించారు. - 2017-21, 2018-22 విద్యాసంవత్సరాల్లో 1,20,574 మంది యూజీ, పీజీ డిగ్రీ పూర్తిచేశారని.. వీరందరికీ పట్టాలు అందిస్తామని జేఎన్‌టీయూకే వీసీ ప్రసాదరాజు చెప్పారు. - శాంతా బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి తనకు మాతృభాషలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలుగులో సుదీర్ఘంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. లోపాలు ఎత్తిచూపుతూ.. పురోభివృద్ధికి ప్రభుత్వాలు అనుసరించాల్సిన తీరునూ వివరించారు. ఆ తర్వాత మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగమూ తెలుగులోనే సాగింది.
ఫౌండేషన్ స్థాయి నుంచి మార్పులు
బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల ఆనంద క్షణాలు
సాంకేతికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకుని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఫౌండేషన్ స్థాయి నుంచే విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్ ఇలా మార్పులు చేస్తున్నామన్నారు. రిస్క్ ఎనాలసిస్, రిస్క్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కోర్సులు విశ్వవిద్యాలయాల్లో పెడతామన్నారు. ముఖ్య అతిథి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి విద్యార్థుల్లో చైతన్యం నింపేలా ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా
-
YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్