logo

మంత్రా.. మజాకా

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు.  

Updated : 17 Mar 2024 06:17 IST

పూర్తికాని భవనాలకు హడావుడి ప్రారంభోత్సవాలు..

లోవలో మహామండపాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

తుని గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు.  ఈ పనులు పూర్తి కాకుండానే దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం అట్టహాసంగా ప్రారంభించేశారు. దేవస్థానంలో సుమారు రూ.2 కోట్ల వ్యయతో అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. ఆలయంపై పనులు పూర్తికాక పోవడంతోపాటు తలుపులు ఏర్పాటు చేయలేదు. రూ. 6 కోట్ల మహామండపం నిర్మాణ పనులు కేవలం 70 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్క్‌లేటర్లకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని నెలల్లో వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం బాలాలయంలో భక్తులకు దర్శనం కల్పించామని ఉగాది నాటికి ప్రధానాలయంలో అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవో విశ్వనాథ]రాజు తెలిపారు. దేవస్థానం ఛైర్మన్‌ గొర్లి అచ్చియ్యనాయుడు  బొంగు ఉమారావు, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ బాబు పాల్గొన్నారు.

నిర్మాణ దశలో మహామండపం

అన్నవరం: అన్నవరం జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం ప్రాంగణంలో ప్రసాదం కౌంటర్‌ నిర్మాణం ఇంకా పూర్తి   కాకుండానే  మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం  ప్రారంభించేశారు.  ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కొద్ది గంటల ముందు హడావుడిగా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంగణంలో నమూనా ఆలయం, దుకాణ సముదాయం, ప్రసాదం కౌంటర్‌ పనులు ఏవీ ఇంకా పూర్తి కాలేదనేది విదితమే. పిల్లర్లపై స్లాబు వేసి ఇంకా నిర్మాణంకాని ఈ భవనంలో అల్యూమినియం కౌంటర్‌ పెట్టి రిబ్బన్‌ కత్తిరించారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్యాబ్లెట్‌ స్టోన్‌ పెట్టి.. దేవస్థానం ఛైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈవో కె.రామచంద్రమోహన్‌లతో కలిసి మంత్రి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి  సత్యదేవుని దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్‌ నిధులతో చేపట్టబోయే నిత్యాన్నదాన భవనం నిర్మాణానికి  టెంకాయ కొట్టారు.   కేంద్ర నిధులతో చేపట్టబోయే ఈ పనులకు ఈనెల 7న ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అవే పనులకు భూమిపూజ పేరిట టెంకాయకొట్టారంతే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని