logo

Rajamahendravaram: అధికారం చెల్లదని చించిపారేశారు..!

అధికారం చేతిలో ఉన్నంతవరకే భయానికో.. భక్తికో.. నాయకులకు దాసోహమయ్యేది.. ఆ తర్వాత ఎవరైనా ఒకటే.. అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో ప్రచారానికి తెరతీశారు.

Updated : 17 Mar 2024 07:11 IST

బోర్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న లీజుదారుడు సిబ్బంది

టి.నగర్‌ (రాజమహేంద్రవరం) న్యూస్‌టుడే: అధికారం చేతిలో ఉన్నంతవరకే భయానికో.. భక్తికో.. నాయకులకు దాసోహమయ్యేది.. ఆ తర్వాత ఎవరైనా ఒకటే.. అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో ప్రచారానికి తెరతీశారు. ఊరంతా పోస్టర్లతో నింపేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ పేరిట సిద్ధం పోస్టర్లుతో భారీ హోర్డింగులు ఆక్రమించగా.. మిగిలిన సందులు, రోడ్లు, కూడళ్లు వదలకుండా సదరు ప్రజాప్రతినిధి తన ప్రచారానికి పోస్టర్లు ఏర్పాటు చేసేశారు. నగరంలో చాలావరకూ హోర్డింగ్‌లు, వీధి దీపాల మధ్య ప్రకటన బోర్టులను నగరపాలక సంస్థ ప్రైవేటు లీజుదారులకు అప్పగిస్తుంది. నెలనెలా నిర్ణయించిన అద్దెను లీజుదారులు నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిక వేళ నగరంలో ప్రకటన బోర్టులను తన అధికార బలంతో ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. అధికారం చేతిలో ఉండడంతో లీజుదారులు నోరెత్తలేకపోయారు. ఒకపక్క అద్దె అడగలేక నగరపాలక సంస్థకు చేతిచమురు చెల్లించాల్సిన పరిస్థితి. ఆఖరికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోడ్‌ కూత కూస్తుందనగా.. అంతకుముందే లీజుదారులు తమ మనుషులతో ప్రజాప్రతినిధి పేరిట ఏర్పాటు చేసిన బోర్డులు చింపి అక్కడే పడేశారు. బోర్డులు తొలగిస్తున్నవారిని ప్రశ్నించగా.. ఇన్నాళ్లూ ప్రకటన బోర్డులు ద్వారా వచ్చే అద్దె ఆగిపోయిందని.. ముందుగా బుక్‌ చేసుకున్నవారు గగ్గోలు పెడుతున్నారని తెలియజేశారు. వాస్తవానికి కోడ్‌ వస్తే మున్సిపల్‌ ప్రణాళికా విభాగం యంత్రాంగం ఎలాగూ నగరంలో ఫ్లెక్సీలను తొలగిస్తుంది.. అంతకంటే ముందుగానే ఇలా లీజుదారులు తొలగించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని