logo

అడ్డగోలుగా తవ్వేయ్‌.. అడ్డదారిలో అమ్మేయ్‌..

అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు.

Published : 18 Apr 2024 06:38 IST

మట్టి తవ్వకాలతో గుంతలు పడిన ఆవ చెరువు

న్యూస్‌టుడే, నిడదవోలు: అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. నిడదవోలు, దేవవరపల్లి మండలాల్లోని వందల ఎకరాలకు ఆవ చెరువే ఆధారం. దానిపై కొందరి వైకాపా నాయకుల దృష్టి పడింది. జిల్లాలో ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి అనుమతి తమకు ఉందంటూ తాడిమళ్లకు చెందిన వైకాపా మహిళా ప్రజాప్రతినిధి భర్త ఆధ్వర్యంలో చెరువు తవ్వేశారు. పంపకాల్లో తేడా రావడంతో అప్పట్లో కొందరు నాయకులు పక్కకు తప్పుకొన్నారు. ట్రాక్టర్‌ మట్టికి రూ.630ల చొప్పున వసూలు చేసేవారు. అందులో ట్రాక్టర్‌కు రూ.130లు సదరు మహిళా ప్రజాప్రతినిధి భర్తతో పాటు, అతని వెనుక ఉన్న నాయకులు పంచుకున్నారు. దీన్ని ఇటుక బట్టీలకు, గ్రామాల్లోని ప్రైవేటు స్థలాల్లో పూడికకు అమ్ముకున్నారు. నిడదవోలు మండలం కోరుమామిడిలో అధికార వైకాపా ఒక మహిళా ప్రజాప్రతినిధి భర్తతో పాటు, ఒక మహిళా ప్రజాప్రతినిధి సమీప బంధువు కలిపి ఇష్టారీతిన తవ్వేశారు. దీంతో చెరువు తన సహజ రూపాన్ని కోల్పోతుంది. మునిపల్లి గ్రామంలోనూ ఇదే తరహాలో వైకాపా నాయకుడు ఒకరు తవ్వకాలు చేపట్టారు. దీనిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరా తీస్తే వేరే వైకాపా నాయకుడి పేరుకు తెరమీదకు వచ్చింది. దీంతో వీరి మధ్య అంతర్గత విభేదాలు వచ్చాయి. విషయం పోలీసులకు చేరడంతో అక్కడ తవ్వకాలు నిలిపేశారు.

  • గతంలో నిడదవోలులో జరిగిన వైకాపా నియోజకవర్గ ఫ్లీనరీ సమావేశంలో కోరుమామిడికి చెందిన వైకాపా మహిళా ప్రజాప్రతినిధి భర్త ఒకరు వేదిక ఎక్కారు. గత ప్రభుత్వ హయాంలో మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. అదే వ్యక్తి ఆవ చెరువును అడ్డగోలుగా తవ్వేశారు. వందల కొద్దీ ట్రాక్టర్ల మట్టిని ఇటుక బట్టీలకు, మెరక పనులకు విక్రయించి లక్షలు సంపాదించుకున్నారు.
  • తాడిమళ్ల గ్రామంలోని ఆవ చెరువులో వైకాపా మహిళా ప్రజాప్రతినిధి భర్త కనుసన్నల్లో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని పొగరుగా బదులిచ్చేవారు. లెక్కాపత్రం లేకుండా మట్టి తవ్వకాలు చేశారు. సర్కారు వారి మనుషులు కావడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు మిన్నకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని