logo

తలూపినా తలోదారే!

రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు.

Published : 24 Apr 2024 06:56 IST

వైకాపా నాయకుల మధ్య కుదరని సయోధ్య

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సైతం నేరుగా రంగంలోకి దిగి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా షరామాములే. అర్బన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంపీ భరత్‌ నామినేషన్‌కు వీరంతా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కొద్ది రోజుల క్రితమే నగరంలో బస్సు యాత్ర చేపట్టిన సందర్భంలో అందరితో మాట్లాడినా ఆయన ముందు తలూపి.. ఆ తర్వాత షరామామూలే అన్నట్లు వ్యవహరించారనే మాట ఆ పార్టీ నాయకుల నోటే వినిపిస్తోంది. నామినేషన్‌లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో భరత్‌రామ్‌తో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. వైకాపా నాయకులు ఎవరూ వెంట రాలేదు.

గూడూరి ర్యాలీకి సై.. భరత్‌కు నై..

ఈసారి ఎలాగైనా రాజమహేంద్రవరంలో పాగా వేయాలని అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. స్థానిక నేతలు మాత్రం ఎవరికి వారు.. తలో దిక్కు అన్నట్లు వ్యవహరించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న పార్టీ స్థానిక నేతలు ఇప్పట్లో ఒక్కటయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతా కలిసి సాగాలని అధినేత చెప్పినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించనట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలో ముందు నుంచి ఉన్నవారిలో పలువురు భరత్‌రామ్‌ నామినేషన్‌ ర్యాలీలో కనబడలేదు. వీరంతా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన గూడూరి శ్రీనివాస్‌ నామినేషన్‌ ప్రక్రియలో మాత్రం పాల్గొనడం గమనార్హం. వాస్తవానికి నగరానికి చెందిన వీరంతా కలెక్టరేట్‌ వరకు వెళ్లారు గానీ.. కూతవేటు దూరంలో నామినేషన్‌ వేస్తున్న మున్సిపల్‌ కార్యాలయానికి మాత్రం రాలేకపోవడం వైకాపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

కారెక్కి జారిపోయారు..

ఒకపక్క సొంతపార్టీ అభ్యర్థి ర్యాలీ జరుగుతుండగా.. వైకాపాలో మరో వర్గం మాత్రం ర్యాలీలో పాల్గొనే నేతలపై కన్నేసింది. ఆ వర్గానికి చెందిన నేతలు ఎవరెవరు పాల్గొంటున్నారనే దానిపై గట్టిగా ఆరాతీసింది. ఇప్పటికే ఎంపీ వర్గానికి దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తూ.. నేరుగా వేరే వర్గానికి ఉప్పందిస్తున్న నేతలు సైతం ర్యాలీలో పాల్గొనేందుకు పూర్తిస్థాయిలో ఆసక్తి కనబర్చలేదు. పైగా కొంతమంది మున్సిపల్‌ కార్యాలయానికి మొహమాటంగా వచ్చి వెంటనే అక్కడ్నుంచి కారెక్కి జారిపోయారు. కనీసం నామినేషన్‌ ప్రక్రియ పూర్తయి, భరత్‌ బయటకు వచ్చేంత వరకూ కూడా ఆగకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని