logo

తీరని నష్టం

తీర ప్రాంతంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు పైగా వర్షం పడింది. ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. బయటకు తీసుకురాలేక పట్టలు కప్పిన ధాన్యం కూడా తడిసిపోయింది. బాపట్ల, రేపల్లె నియోజవర్గాల్లో రెండు వేల ఎకరాల్లో వరి పనలు నీటిలో తేలుతున్నాయి.

Published : 15 Jan 2022 00:57 IST


కల్లంలో ఉన్న ధాన్యంపై కప్పిన పట్ట

బాపట్ల, న్యూస్‌టుడే : తీర ప్రాంతంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు పైగా వర్షం పడింది. ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. బయటకు తీసుకురాలేక పట్టలు కప్పిన ధాన్యం కూడా తడిసిపోయింది. బాపట్ల, రేపల్లె నియోజవర్గాల్లో రెండు వేల ఎకరాల్లో వరి పనలు నీటిలో తేలుతున్నాయి. ధాన్యం పూర్తిగా రంగుమారి మొలకలు వస్తాయని, ఎవరూ కొనుగోలు చేయరని రైతులు వాపోతున్నారు. మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సాగుదారులు పంటలు ఎలా కాపాడుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. మూడు వేల ఎకరాల్లో పైరు నేలవాలింది. ప్రభుత్వం స్పందించి అకాల వర్షాల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని, రంగు మారిన ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నగరం, న్యూస్‌టుడే : నగరం మండల పరిధిలోని మంత్రిపాలెం, బొడ్డువారిపాలెం, గుర్నాథనగర్, అల్లపర్రు శివారు గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి కోతలు కోశారు. పూడివాడ, నగరం, ధూళిపూడి, మట్లపూడి, పెదపల్లి, బెల్లంవారిపాలెం తదితర గ్రామాల్లో కుప్పలు నూర్పిడి చేశారు. ఎడతెరిపిలేని వర్షాలకు కల్లాల్లోని ధాన్య రాశులు, కోతలు కోసిన వరి పనలు నీటిలో మునిగాయి.


 చెరుకుపల్లిలో మినుము పైరులో నిలిచిన వాన నీరు 

ఆందోళనలో రైతులు..
చెరుకుపల్లి, న్యూస్‌టుడే : అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరుకుపల్లి మండలంలో మినుము సాగులో ఉంది. మరోవైపు 200 హెక్టార్లలో ఇప్పటికే వేరుశనగ విత్తనం వేయగా.., మరో 500 హెక్టార్లలో విత్తేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ దశలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. మినుము వేసిన పొలాల్లో అంగుళం లోతు నీళ్లు కుదురుకొన్నాయి. 15-20 రోజుల క్రితం వేసిన వేరుశనగ మొలక బాగా వచ్చి రెండంగుళాల ఎత్తు ఎదిగింది. మొలకెత్తిన వేరుశనగ పొలాల్లో పెద్దగా నీళ్లు నిలవకపోయినా నాలుగైదు రోజుల క్రితం విత్తనం వేసి మొలకరాని పొలాల్లో మాత్రం అధిక తేమ వల్ల విత్తనం కుళ్లిపోయే ప్రమాదముంటుందని ఆందోళన చెందుతున్నారు. వేరుశనగ సాగులో విత్తనం ఖర్చే ఎకరానికి రూ.25 వేలకు పైగా ఉంటుంది. దీంతో విత్తనం ఏమవుతోందనే భయంతో సాగుదారులు దిగాలు చెందుతున్నారు. వాన ఇంతటితో ఆగితే మినుము సాగు చేస్తున్న వారికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని, వర్షం కొనసాగితే మాత్రం వేరుశనగ, మినుము పైర్లు రెండూ దెబ్బతినే ప్రమాదముందని వాపోతున్నారు.
నిజాంపట్నంలో 15 మి.మీ. వర్షపాతం
నిజాంపట్నం, న్యూస్‌టుడే : నిజాంపట్నం మండలంలో గురువారం రాత్రి 15 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షానికి మండలంలో ప్రధాన, అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. పొలాల్లో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని