logo
Published : 25 Jun 2022 05:35 IST

ఇక ప్లాస్టిక్‌ పూర్తిగా నిషిద్ధం

జులై నుంచి అమలు

ప్రత్యామ్నాయంగా జొన్న సంచులు

ఈనాడు-అమరావతి

మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతున్న వాటిల్లో ప్లాస్టిక్‌ భూతం ఒకటి. ఇది కుళ్లకుండా.. భూమిలో కలవకుండా ఏళ్ల తరబడి ఉండటంతో కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని జులై ఒకటో తేదీ నుంచి పూర్తిగా నిషేధించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశించింది.

ఇప్పటికే గుంటూరు నగరపాలకసంస్థ ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దటానికి గతేడాది నవంబరు 9 నుంచి ప్లాస్టిక్‌ సంచుల వినియోగంపై దశల వారీ నిషేధం విధిస్తూ అమలుపరుస్తోంది. తొలి దశలో 20, ఆతర్వాత 40 మైక్రాన్లకు లోపు బరువు కలిగినవి ప్రస్తుతం 70 మైక్రాన్లకు లోపు బరువు కలిగిన సంచుల వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తోంది. అదే సమయంలో వాటి విక్రేతలకు వాటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, జూలై ఒకటినాటికి పూర్తిస్థాయిలో విక్రయాలకు స్వస్తి పలకాలని సూచించటంతో ఇప్పటికే చాలా షాపుల్లో నిలిచిపోయాయి. మార్కెట్లో వాటి నిల్వలు అంతగా లేవు. జూలై ఒకటో తేదీ నుంచి అసలు ప్లాస్టిక్‌ సంచుల వినియోగం, విక్రయాలకు తావు లేకుండా చేయటానికి సన్నద్దమైంది. ఆ గడువుకు మరో ఆరు రోజులు మాత్రమే వ్యవధే ఉంది. ఈ వ్యవధిలో ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయం ఏమిటో తెలియజేయటంతో పాటు దాని వినియోగం వల్ల కాలుష్యం ఎలా పెరిగిపోతోంది? ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడి ఉండటం వల్ల మానవాళికి సంభవిస్తున్న నష్టాన్ని వాడవాడలా తెలియజేసి ప్రజలను చైతన్యపరచటానికి శనివారం నుంచి గుంటూరు నగరపాలక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. శనివారం తొలుత హిమని సెంటర్‌వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతి నగరంలో ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న జొన్న పిండి సంచులను నగరానికి తీసుకొస్తున్నారు. సంబంధిత కంపెనీ తయారీదారుని నగరానికి రప్పించి ఆ సంచులు విక్రయాలు నగరంలో ఇకమీదట కొనసాగించేలా అనుమతులు ఇచ్చారు. నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి ఆ సంచుల విక్రయాలకు కౌంటర్లు తెరవబోతున్నారు.

తయారీదారులకు నోటీసులు

మరోవైపు గుంటూరు ఆటోనగర్‌ కేంద్రంగా ప్లాస్టిక్‌ సంచులు తయారుచేసే యూనిట్లు 10 వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తానికి అవి సరఫరా అవుతున్నాయి. వాటి తయారీదారులకు కాలుష్య నియంత్రణమండలి ద్వారా నోటీసులు జారీ చేశారు. మరోవైపు నగరపాలక నుంచి వాటి తయారీదారులు, విక్రేతలతో జూలై ఒకటి నుంచి వాటి అమ్మకాలు జరపబోమని అండర్‌ టేకింగ్‌ లేఖలు తీసుకున్నారు. అందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే భారీగా అపరాధ రుసుములు విధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నగరంలో సగటున రోజుకు 450 టన్నుల పైబడి చెత్త వెలువడుతోంది. అందులో సుమారు 100 టన్నుల పైబడి ప్లాస్టిక్‌ సంచులు, డబ్బాలు వంటివి ఉంటున్నాయని గుర్తించారు. వాడి కాల్వల్లో, రహదారులపై పడేయటం వంటివి చేయటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు ఇళ్లల్లో మిగిలిన ఆహార పదార్థాలను సంచుల్లో పెట్టి రహదారులపై పడేయటంతో వాటిని మూగజీవాలు తింటూ గొంతుకు అడ్డుపడి చనిపోవటం వంటి సంఘటనలు అనేకం.

నేటి నుంచి తనిఖీలు

శనివారం నుంచే నగరంలోని 207 సచివాలయాల పరిధిలో ఉద్యోగులతో ప్రతి షాపును తనిఖీ చేయించటానికి కార్యాచరణ రూపొందించారు. వాలంటీర్లను దీనిలో భాగస్వాములను చేయనున్నారు. సచివాలయాల్లో ఉండే పర్యావరణ కార్యదర్శులు, బయో ఇంజినీర్లు ఈ చర్యలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఏ షాపులో అయినా కవర్లు గుర్తిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని తగులబెట్టాలని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ఆదేశించారు.

ఉల్లంఘిస్తే జరిమానాలు ఇలా..

తయారీదారులకు రూ.50 వేలు

చిల్లర వర్తకులకు రూ.2500-15000

వినియోగదారులకు రూ.250-500

తిరుపతిలో విక్రయాలు చేస్తున్నవారికి ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలను ప్రస్తుతం మొక్కజొన్న పిండితో తయారుచేసిన సంచుల్లో పెట్టి భక్తులకు అందజేస్తోంది. ఆ సంచి మందం బాగానే ఉంది. పిండి రుబ్బుకునే గ్రైండర్లలో పడేస్తే చాలు ఆ సంచి ఇట్టే పిండైపోతోంది. దీనివల్ల మానవాళికి నష్టం లేదని కొన్ని ఇళ్లల్లో వాడిచూశాం. ఐదు కిలోల బరువు వరకు వాటిల్లో పెట్టుకోవచ్ఛు ఈ సంచులను నగరవాసులకు పరిచయం చేయటానికి నగరంలోని ప్రధాన కూడళ్లలో రహదారి వెంబడి స్టాల్స్‌ పెట్టుకుని విక్రయించడానికి అనుమతులిచ్చాం. జనపనార సంచులు,. క్లాత్‌ బ్యాగ్‌ల తయారీదారులు కూడా విక్రయించుకోవచ్చని సూచించాం. - కావటి మనోహర్‌నాయుడు, మేయర్‌, నగరపాలక సంస్థ

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని