logo

100% స్వచ్ఛం

ప్రజల్లో చైతన్యం.. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం.. గతంలో ఎదురైన సంఘటనల దృష్ట్యా ఆ పల్లెలు సంపూర్ణ పారిశుద్ధ్యంలో ముందడుగులో ఉన్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్లు ఏర్పాటుతో స్వచ్ఛసంకల్పం సాధించాయి.

Published : 13 Aug 2022 06:19 IST

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే


కె.రాజుపాలెం గ్రామ కూడలి

ప్రజల్లో చైతన్యం.. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం.. గతంలో ఎదురైన సంఘటనల దృష్ట్యా ఆ పల్లెలు సంపూర్ణ పారిశుద్ధ్యంలో ముందడుగులో ఉన్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్లు ఏర్పాటుతో స్వచ్ఛసంకల్పం సాధించాయి. అవే అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌,  మండలంలోని గోపాలపురం, బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం గ్రామాలు.

అద్దంకి మండలం గోపాలపురంలో 1260 మంది జనాభా ఉండగా ఇందులో అధికశాతం ఎస్సీ/ఎస్టీలు. వీరంతా కొండపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలం క్రితం వీరంతా చెంబులు చేతపట్టుకుని ఆరుబయటకు వెళ్లేవారు. రాత్రి సమయాల్లో ఇలా వెళ్లిన వారిలో ఒకరిద్దరు ప్రమాదాలకు గురై మృతిచెందారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అప్పటి ఎంపీడీవో జి.సాంబశివరావు, వెలుగు అధికారి గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహం అందించారు. అవసరమైన నిధుల్ని మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య ద్వారా అందించారు. దీంతో దాదాపు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పడింది.

ఆదర్శం ఎన్టీఆర్‌ నగర్‌
విభిన్న సామాజికవర్గాలకు నిలయమైన ఎన్టీఆర్‌ నగర్‌లో అధిక శాతం మంది గుడారాల్లోనే నివసించేవారు. మరుగుదొడ్డి లేని కారణంగా వీరంతా ఊరచెరువులో బహిర్భూమికి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం కాలనీకి చెందిన రాజశేఖర్‌(17) ఇలా వెళ్లిన సమయంలో పాముకాటుకు గురై మృతిచెందాడు. దీంతో కాలనీవాసుల్లో చైతన్యం పెరిగింది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థ వారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. ఫలితంగా 1000 ఇళ్లకు గాను 950 ఇళ్లకు ఇవి ఏర్పడ్డాయి. స్థానిక కౌన్సిలర్‌ గుంజి కోటేశ్వరరావు మిగిలిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు.

యువత.. పెద్దలు.. అధికారుల సాయంతో
ప్రభుత్వం... ప్రజాప్రతినిధుల సహకారంతో బల్లికురవ మండలం కె.రాజుపాలెం గ్రామ ప్రజలు వంద శాతం స్వచ్ఛత సాధించారు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో స్వచ్ఛత సాధించిన గ్రామాలకు అవార్డులను ప్రకటించగా కె.రాజుపాలెం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి, పురస్కారం అందుకుంది. గ్రామంలో మొత్తం 340 కుటుంబాలు ఉండగా మొత్తం 1041 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడంతో పాటు ఊరిలోని వ్యర్థాలను గ్రామానికి దూరంగా తరలించారు. దీనికితోడు వంద శాతం సీసీ రహదారులు నిర్మించడంతో 2016 ఆగస్టు 15న 100 శాతం స్వచ్ఛత సాధించినట్లు అప్పటి ప్రకాశం జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. ఉన్నత చదువులు అభ్యసించిన యువత, గ్రామ పెద్దలు, అధికారులు నాడు ప్రజల్లో చైతన్యం కల్పించడంతో ఇది సాధ్యమైంది. నాటి నుంచి ఆ స్ఫూర్తిని ప్రజలు కొనసాగిస్తున్నారు.


ఎన్టీఆర్‌ నగర్‌లో ఇంటింటికీ ఏర్పాటైన మరుగుదొడ్డి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని