logo

రూ.50 లక్షలు పైబడిన డాక్యుమెంట్‌పై టీడీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్‌ ఏదైనా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్‌ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌కు ఉపక్రమించాలని

Published : 15 Aug 2022 06:39 IST
రిజిస్ట్రేషన్‌ శాఖలో అమలు
ఈనాడు, అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్‌ ఏదైనా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్‌ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌కు ఉపక్రమించాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఈ నిర్ణయంతో చాలా మంది అంత విలువ కలిగిన డాక్యుమెంట్లు సమర్పించడానికి భయపడుతున్నారు. ఆస్తిని ముక్కలుగా విభజించి సాధ్యమైనంత వరకు రూ.50లక్షల లోపే డాక్యుమెంట్‌ విలువ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

టీడీఎస్‌ అనేది ఆదాయపన్ను శాఖకు వెళ్తుంది. కేంద్రం తిరిగి కొంత రాష్ట్రానికి చెల్లిస్తుంది. దీంతో ఈ ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి టీడీఎస్‌ కచ్చితంగా మినహాయించాలని ఆదేశించడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని దస్తావేజు లేఖర్లు చెబుతున్నారు. గతంలో వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అధికారులు టీడీఎస్‌ కట్టించేవారు. ప్రస్తుతం దాన్ని ఇళ్లు, భవనాలు, ఖాళీ స్థలాలకు అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది టీడీఎస్‌ నుంచి ఎలా తప్పించుకోవాలని అన్వేషిస్తూ విక్రయించే ఆస్తిని ఒకే డాక్యుమెంట్‌లో కాకుండా రెండు, మూడు డాక్యుమెంట్లుగా సమర్పించి ఆ మేరకు దాని విలువ రూ.50లక్షల లోపే ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. కారణాలేమైనా రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అధికారులు సైతం అంటున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన సమయంలోనే టీడీఎస్‌ చెల్లించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తుండడంతో పెద్ద పార్టీలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఆసక్తి కనబరచటం లేదని, కేవలం అత్యవసరాలకు ఆస్తులు అమ్ముకునేవారు, పిల్లల పెళ్లిళ్లకు ఆస్తులు బదలాయించుకునే డాక్యుమెంట్లు, తనఖా రుణాలకు సంబంధించినవే ఎక్కువుగా రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఎప్పుడైతే టీడీఎస్‌ మినహాయించారో సంబంధిత చెల్లింపుదారుడి వివరాలు ఆన్‌లైన్‌లో వెంటనే ఐటీ శాఖకు తెలిసిసోతాయని భయపడుతున్నారు. ఈ నిబంధన రాక మునుపు ఏడాదికి ఒకసారి రిజిస్ట్రేషన్‌ అధికారులు టీడీఎస్‌ మినహాయించిన డాక్యుమెంట్ల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేసేవారు. ఈ ప్రకారం పక్కాగా వివరాలు రావడం లేదని, రిజిస్ట్రేషన్‌ వర్గాలు టీడీఎస్‌ చెల్లించినా చెల్లించకపోయినా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌కు ఉపక్రమించేవారన్న అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పైసా ఆదాయం కీలకంగా మారడంతో ఈ టీడీఎస్‌ వసూలు అనేది వ్యవసాయ భూముల విషయంలోనే కాదు ఇల్లు, ఖాళీ స్థలాలకు అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవలే ఉత్తర్వులు వెలువరించింది. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నామని రిజిస్ట్రేషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయపన్నుశాఖకు ఆదాయం ఎగ్గొట్టకుండా ఉండటానికి ఈ నిబంధనను ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలోనే అమలు చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి టీడీఎస్‌ కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ వసూలు చేసి దాన్ని తిరిగి ఐటీశాఖ పద్దులో ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నామని అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు