logo

ఏడాది పాలన సంతృప్తికరం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏడాది పాలన సంతృప్తికరంగా కొనసాగిందని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. గుంటూరులోని జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో

Published : 26 Sep 2022 06:01 IST

కేకు కోస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా

జిల్లాపరిషత్తు(గుంటూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏడాది పాలన సంతృప్తికరంగా కొనసాగిందని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. గుంటూరులోని జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో పరిపాలన అంశాల్లో జడ్పీటీసీ సభ్యుల భాగస్వామ్యం, అధికారాల బదిలీ అంశాలపై కార్యశాలను ఆదివారం నిర్వహించారు. జిల్లాపరిషత్తు సీఈవో జి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్రిస్టినా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాపరిషత్తు పాలకవర్గం ఏడాది పాలనను పూర్తి చేసుకుని ద్వితీయ ఏడాదిలోకి ప్రవేశించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.12 కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. జడ్పీ నూతన భవన నిర్మాణం కోసం సీఎంకి విజ్ఞప్తి చేయగా రూ.10 కోట్లను మంజూరు చేసేందుకు సమ్మతించారని.. త్వరలోనే నిధులు విడులవుతాయన్నారు. అన్యాక్రాంతమైన జడ్పీ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగానే ప్రతి జడ్పీటీసీ సభ్యునికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తామని ప్రకటించారు. పలువురు జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ ఏడాది కాలంలో కొంత వరకే అభివృద్ధి పనులు చేశామన్నారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో తమను కనీసం పిలవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు జిల్లాల అధికారులకు ప్రొటోకాల్‌ పాటించి జడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని చెప్పినట్లు సీఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోసారి అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. మండల పరిషత్తు కార్యాలయాల్లో జడ్పీటీసీ సభ్యులు కూర్చోవడానికి సీటు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను కొందరు జడ్పీటీసీ సభ్యులు తెలిపారు. జడ్పీటీసీ సభ్యులకు సీటు కేటాయించేలా ఆదేశాలు ఇస్తామని ఛైర్‌పర్సన్‌, సీఈవో చెప్పారు. గౌరవ అతిథిగా గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు హాజరై మాట్లాడారు. అనంతరం ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ దంపతులు కేకును కోశారు. తర్వాత జడ్పీటీసీ సభ్యులను ఛైర్‌పర్సన్‌ జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించారు. కారుణ్య నియామకంలో ఆరుగురు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఛైర్‌పర్సన్‌ అందజేశారు. సమావేశంలో జడ్పీ ఉపాధ్యక్షులు శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, బత్తుల అనురాధ, డిప్యూటీ సీఈవో సుజాత, జడ్పీటీసీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని