logo

మూడు రాజధానుల నిర్ణయంతోనే ఆర్థిక సంక్షోభం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమని శనివారం తుళ్లూరు శిబిరంలో రైతు కాటా అప్పారావు విమర్శించారు.

Published : 02 Oct 2022 05:32 IST

తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమని శనివారం తుళ్లూరు శిబిరంలో రైతు కాటా అప్పారావు విమర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ దీక్షలు చేస్తున్న రైతులు మాట్లాడుతూ.. వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితిలేదన్నారు. ఆంధ్రులంతా ఏకైక రాజధానిగా అమరావతిని కోరుకొంటున్నారని పేర్కొన్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయాత్రను ప్రజలు పూలు చల్లి స్వాగతించడమే దానికి నిదర్శనమన్నారు. అడుగడుగునా పాదయాత్రకు మద్దతు తెలిపి రైతులతో కలసి నడుస్తున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ ప్రజల అభిప్రాయాలను, న్యాయస్థానాల తీర్పులను గౌరవించి, తన నిర్ణయాన్ని మార్చుకొని, అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో చేస్తున్న నిరసనలు 1019వ రోజుకు చేరాయి. అమరావతి ఉద్యమానికి ప్రారంభం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ మద్దతు తెలిపిన ప్రవాసాంధ్రుడు, తానా బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలుసుకొని, వారు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రమాదంలో చనిపోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని శనివారం తుళ్లూరు శిబిరంలో రైతులు, మహిళలు మౌనం పాటించి నివాళులర్పించారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

దిల్లీలో ‘జై అమరావతి’ నినాదాలు

రాయపూడి గ్రామానికి చెందిన రైతులు షేక్‌ చాన్‌బాషా, షేక్‌ నాగులుమీరా తదితరులు శనివారం దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట ముందు నిలబడి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని