logo

ప్రేమే నేరమా..?

చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో ప్రియుడి ఇంటిపై ప్రియురాలి బంధువులు సుమారు 40 మంది గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడి ఇంటిలోని వస్తువులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లి జయంతిని చితకబాది యువతిని తమ వెంట తీసుకెళ్లారు.

Published : 08 Oct 2022 04:23 IST

ప్రియుడి ఇంటిపై దాడి

దౌర్జన్యంగా యువతిని తీసుకెళ్లిన బంధువులు

మోహనకృష్ణ, సుష్మ పెళ్లి ఫొటో

తిరుపతి, న్యూస్‌టుడే: చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో ప్రియుడి ఇంటిపై ప్రియురాలి బంధువులు సుమారు 40 మంది గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడి ఇంటిలోని వస్తువులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లి జయంతిని చితకబాది యువతిని తమ వెంట తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఝాన్సీ, శ్రీనివాసరావు దంపతుల కుమార్తె సుష్మ... చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీ మోహనరెడ్డి కాలనీకి చెందిన మోహనకృష్ణ (ఫిజియోథెరపిస్టు) తిరుపతి స్విమ్స్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆగస్టు 27న వీరిద్దరూ ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నూతన దంపతులు మోహనకృష్ణ ఇంట్లో తల్లి జయంతి, సోదరి దీప్తితో కలిసి నివసిస్తున్నారు. వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని సుష్మ కుటుంబ సభ్యులు సుమారు 40 మంది రాడ్లు, మారణాయుధాలతో గురువారం రాత్రి పథకం ప్రకారం మోహనకృష్ణ ఇంటిపై దాడిచేశారు. రాడ్లతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించి సుష్మను తమ వెంట తీసుకెళ్లారు. మోహనకృష్ణ డయల్‌ 100కి ఫోన్‌ చేయడంతో స్పందించిన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. తన కొడుకు, కోడలికి ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని మోహనకృష్ణ తల్లి జయంతి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల తరఫు బంధువులతో వెళ్లిన సుష్మ వారి నుంచి తప్పించుకుని తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో మోహనకృష్ణ అక్కడికి వెళ్లారు.

బద్ధలు కొట్టిన తలుపు​​​​​​​

ప్రాణ హాని ఉంది..

ఈ సందర్భంగా నవ దంపతులు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..యువతి పుట్టింటివాళ్లు పెళ్లికి అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకుని యువకుడి ఇంట్లో కాపురం ఉంటున్నాం. నగదు, నగలతో యువతి పుట్టింటి నుంచి మోహనకృష్ణ ఇంటికి వచ్చేసిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల చంద్రగిరి పోలీసులు విచారణ జరిపి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భర్తతోనే ఉంటానని తేల్చి చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రగిరి పోలీసులు స్టేషన్‌కు రావాలని పిలవడంతో గురువారం సాయంత్రం తిరుపతి ఎస్పీని కలిసి సమస్య తెలియజేయాలని ప్రయత్నించారు. అంతలోనే 40 మందికిపైగా మా ఇంటిపై మారణాయుధాలతో విధ్వంసానికి తెగబడ్డారు. తమతో రాకుంటే చంపేస్తామని బెదిరించి సుష్మను గుంటూరుకు తీసుకెళ్లారు. వాళ్లను ఏ మార్చి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకుని తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని