logo

యుద్ధ వితంతువులకు తక్షణమే నివాస స్థలాలు

యుద్ధ వితంతువులకు జిల్లాలో తక్షణమే నివాస స్థలాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. జిల్లా సైనికబోర్డు నూతన కమిటీ తొలి సమావేశాన్ని కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు.

Updated : 01 Jun 2023 05:04 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

బాపట్ల, న్యూస్‌టుడే: యుద్ధ వితంతువులకు జిల్లాలో తక్షణమే నివాస స్థలాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. జిల్లా సైనికబోర్డు నూతన కమిటీ తొలి సమావేశాన్ని కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు 300 చదరపు అడుగుల నివాస స్థలాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. జిల్లాలో 11 మంది యుద్ధ వితంతువులు, ఐదుగురు వీరమాతలు, ఎనిమిది మంది దివ్యాంగ సైనికులు ఉన్నారని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి తక్షణమే నివేదిక పంపాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. మాజీ సైనికులకు ఇంటి పన్ను మినహాయింపు పక్కాగా అమలు చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనికులకు 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదెకరాల మెట్ట భూమి పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ పంపిణీ జరిగి పదేళ్లు పూర్తయిన పట్టాలను 22ఏ జాబితా నుంచి తొలగించటానికి అధికారులు ప్రతిపాదనలు పంపించాలన్నారు. సైనికుల విశ్రాంత గృహం, సీఎస్‌డీ క్యాంటీన్‌ ఈసీహెచ్‌ఎస్‌, సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాల నిర్మాణానికి 80 సెంట్ల భూమి గుర్తించాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన సైనికుల భార్యలకు అంగన్‌వాడీ ఉద్యోగాలు, నిజాంపట్నంలో సీఎస్‌డీ క్యాంటీన్‌ ఏర్పాటు, బాపట్లలో మాజీ సైనికులకు హెల్త్‌ క్లినిక్‌, కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కమిటీ సభ్యులు కోరారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిణి గుణశీల, ఎల్‌డీఎం శివకృష్ణ, గృహనిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌, డీఈవో రామారావు, పరిశ్రమల శాఖ జీఎం మదన్‌మోహన్‌, కమిటీ సభ్యులు సాంబశివరావు, హరినాథరెడ్డి, రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని