logo

పోలీసుల చూపు ఒక వైపే..!

జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్‌ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి.

Published : 17 Apr 2024 04:18 IST

వైకాపాకు దన్నుగా నిలుస్తున్న యంత్రాంగం
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా వివక్షే
ఈసీకి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధం

బాపట్ల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి తెదేపా అభ్యర్థి నరేంద్రవర్మను వెళ్లిపోవాలని సీఐ శ్రీనివాసులు సూచిస్తుండగానే కార్యకర్తలతో వచ్చిన వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కోన రఘుపతి(పాతచిత్రం)

ఈనాడు-బాపట్ల: జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్‌ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి. అందుకు భిన్నంగా, యథావిధిగానే కొందరు పోలీసులు విధి నిర్వహణలో వివక్ష చూపుతున్నారు. అడుగడుగునా అధికార అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. వారు తప్పు చేసినా ఒప్పు అనేలా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం బాపట్లలో స్థానిక జమ్ములపాలెం ఆర్వోబీ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్‌ బరిలో ఉన్న అభ్యర్థులు వేగేశన నరేంద్ర వర్మ, తెన్నేటి కృష్ణప్రసాద్‌లు తొలుత విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారు అక్కడ నివాళి అర్పిస్తుండగానే పోటీగా  వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చారు మీరు దిగిపోండని కూటమి అభ్యర్థుల్ని హడావుడి చేసి కిందకు దింపటం స్థానిక పోలీసు అధికారుల తీరుగా ఉంది.. ఒకవైపు తెదేపా అభ్యర్థులు ముందుగా అక్కడకు చేరుకుని పూల దండలు వేస్తుంటే కొద్దిసేపు వేచిచూడాలని వైకాపా వారికి చెప్పి నిలురించాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు. ర్యాలీగా వస్తున్న అధికార ఎమ్మెల్యే, వారి కార్యకర్తలకు అభ్యంతరం చెప్పలేదు. కూటమి అభ్యర్థులు, వారి కార్యకర్తలు అక్కడ ఉండగానే ఆ ప్రదేశానికి వైకాపా ఎమ్మెల్యే, వారి కార్యకర్తలను అనుమతించి ఓ రకంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడేలా పోలీసులు వ్యవహరించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద ఎదురెదురు తారసపడి పోటాపోటీ నినాదాలు చేసుకుని బాహాబాహీకి దిగటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వ్యవహారంపై తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చారని తమను నివాళి అర్పించకుండా, ప్రసంగం పూర్తికాకుండానే పోలీసులు పంపించేయటాన్ని కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ తప్పుబట్టారు. ఈ పక్షపాత వైఖరిపై ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

  • పర్చూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆదివారం రాత్రి యద్ధనపూడి మండలం పూనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప£ల్లె నిద్ర పేరుతో రాత్రిపూట హడావుడి చేశారని తెదేపా నాయకులు తెలిపారు. క్రేన్‌తో భారీ పూల దండను ప్రధాన కూడలిలో బాలాజీకి వేయించారు. వీటిల్లో కొన్ని కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు తీసుకోలేదు. అయినా ఈ నిర్వాకం పోలీసులు, ఎంసీసీ బృందాలకు పట్టలేదు. అదే విపక్షాలైతే ప్రచారం చేయటానికి, క్రేన్‌తో పూలదండలు వేయించుకోవటానికి అనుమతులు తీసుకున్నారా అని చెప్పి పోలీసులే అడ్డుకునేవారు. కానీ వైకాపా వారి విషయంలో పోలీసు యంత్రాంగానికి అవేం గుర్తుకురావటం లేదా? అని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

 

  • అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఈ మధ్య తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన ప్రచార వాహనాన్ని స్ధానిక వైకాపా కార్యకర్తలు ఓ బజార్‌లో తిరగటానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆపై వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్‌పై చేయిచేసుకున్నారు. అసలే అది ఫ్యాక్షన్‌ గ్రామం. కోడ్‌ అమల్లోకి రాగానే అక్కడ పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయాలి. అది వైకాపాకు బాగా పట్టున్న గ్రామం కావటంతో పోలీసులు పికెట్‌ పెట్టకుండా తెదేపా వారి వాహనాలు ప్రచారానికి రాకుండా అడ్డుకుంటున్నారని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఆ ఊళ్లో తమ వాహనంపై దాడిచేసిన వారిని గుర్తించినా అదుపులోకి తీసుకోలేదని ఈ పక్షపాత వైఖరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే రవికుమార్‌ చెప్పారు.
  • ఇటీవల కూటమి ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభ జరిగింది. దానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. తొలుత వేమూరు మార్కెట్‌యార్డు నుంచి రోడ్‌షో ప్రారంభమైంది. చంద్రబాబు కాన్వాయ్‌కు ఇతర వాహనాలు అడ్డు రాకుండా కట్టడి చేయటంలో పోలీసులు వైఫల్యం చెందారు. పార్టీ వాలంటీర్లే అడ్డువస్తున్న వాహనాలను పక్కకు పంపుతూ కాన్వాయ్‌ సాగేలా చర్యలు చేపట్టారు. ఈ వివక్షపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఈసీకి ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని