logo

తాడేపల్లిలో ఇల్లన్నావు.. తోడేళ్లకు తోడున్నావు..

ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది.

Updated : 17 Apr 2024 06:27 IST

వైకాపా నాయకుల అరాచకం
రాయల్టీ ఎగ్గొట్టి ఇసుక తోడేశారు
అడ్డొస్తే అంతుచూస్తామని బెదిరింపులు

ఈనాడు, అమరావతి: ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తూ అడ్డుకుంటున్న వారిపై దాడులకు తెగబడుతోంది. నిబంధనలు పాటించమని అడిగితే అంతం చేస్తామని హెచ్చరిస్తోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే నదీ తీర గ్రామాల ప్రజలను ట్రాక్టర్లతో తొక్కించి చంపడానికి వెనుకాడడం లేదు. అక్రమాలను బహిర్గతం చేస్తున్నారన్న అక్కసుతో దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎలా...

  • జిల్లాలో కొల్లిపర మండలం మున్నంగి, బొమ్ము వానిపాలెం-14, 15, తాడేపల్లి మండలం గుండిమెడ రీచ్‌లలో మాత్రం కూలీలతో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. ఇందుకు భిన్నంగా తాడేపల్లి మండలం గుండెమెడ, దుగ్గిరాల మండలం పెదకొండూరు, గొడవర్రు, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, బొమ్మవానిపాలెం రీచ్‌లలో రాత్రిపగలు తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ యంత్రాలు వాడకూడదన్న నిబంధన మచ్చుకైనా అమలుకావడం లేదు. నిత్యం వందల లారీల్లో ఇసుక తరలిస్తూ వైకాపా నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో ఎక్కడపడితే అక్కడ 20 అడుగుల లోతుకుపైగా తవ్వకాలు చేస్తున్నారు.
  • జిల్లాలో జీసీకేసీ కంపెనీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కంపెనీ సిబ్బందికి ప్రతి రీచ్‌లో స్థానికంగా వైకాపా నేతలు సహకారం అందించి లబ్ధి పొందుతున్నారు. లారీలకు స్లిప్పులు ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి, వరుసలో ఇసుక నింపడానికి, రీచ్‌లో పనులు పర్యవేక్షించడానికి వైకాపా నేతల అనుచరులను కంపెనీ ఉద్యోగులుగా పెట్టుకుంది. ఇందుకు ప్రతిఫలంగా వైకాపా నేతలకు తక్కువ ధరకే వరుసలో లేకుండా వచ్చిన లారీలకు వచ్చినట్టే ఇసుక లోడ్‌ చేస్తున్నారు. తక్కువ ధర, పన్నులు ఎగ్గొట్టడం, రీచ్‌లోకి లారీ వెళ్లిన వెంటనే లోడ్‌ చేస్తుండడంతో వైకాపా వారికి ఇసుక వ్యాపారం అత్యంత లాభదాయకంగా మారింది.
  • నేతలు పెట్టిన కుర్రాళ్లు రీచ్‌లో పనిచేసినందుకు సొమ్ము ముట్టజెప్పుతున్నారు. వైకాపా నేతలకు అప్పనంగా సొమ్ము వస్తుండడంతో ఇసుక తవ్వకాలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వైకాపా నేతలు రీచ్‌లో పనిచేసే కుర్రాళ్లను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారు. దాడులు చేస్తే కేసులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ నేత చూసుకుంటుండడంతో కుర్రాళ్లు రెచ్చిపోయి సొంత గ్రామస్థులపైనే దాడులకు తెగబడుతున్నారు.
  • సాక్షాత్తూ సీఎం జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ అయిదేళ్లలో వైకాపా ఇసుక మాఫియా రూ.వందల కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొట్టింది. ఒకప్పుడు స్థానికులకు ఇసుక ఉచితంగా దొరికేది. దూరంగా ఉన్నవారికి తక్కువ ధరకైనా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇసుక తోడేళ్లదే అంతా. వారు చెప్పిందే ధర.. వారు చెప్పిన వారికే లోడింగ్‌.. వెరసి భవన నిర్మాణాలకు ఇసుక దొరకని పరిస్థితి. కూలీలకు ఉపాధి కరవైన దౌర్భాగ్యం. వాళ్లు తవ్వుకుపోతే మనదేం పోయిందని మౌనంగా ఉన్నందుకు ఆ నష్టం మన ఇంటి దాకా వచ్చింది.

కడప నేతల ఆధ్వర్యంలో తవ్వకాలు

  • కూలీల చేత ఇసుక తీసి వాహనాలకు నింపి రవాణా చేసేందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) అనుమతులు ఇచ్చింది. నిబంధనలకు నీళ్లొదిలి భారీ పొక్లెయిన్లు పెట్టి ఇసుక తరలించారు. జిల్లాలో ఇసుక తవ్వుకోవడానికి జీసీకేసీ సంస్థకు అనుమతులు ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన ముఖ్యనేతలకు సమీప బంధువు ఒకరు ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. ఇతనికి స్థానికంగా ఉన్న వైకాపా నేతల అనుచరులు అన్నివిధాలా సహకారం అందిస్తున్నారు. ఇసుకాసురుల కాసుల కక్కుర్తితో రాత్రీ పగలు తేడా లేకుండా కృష్ణానదికి తూట్లు పొడుస్తున్నారు.
  • కలెక్టర్‌ స్వయంగా ఇసుక రీచ్‌లు తనిఖీలు చేసి అక్రమ తవ్వకాలు జరగడం లేదని నివేదికలు ఇవ్వడంతో దొంగచేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇదే అదునుగా ప్రభుత్వానికి రాయల్టీ సైతం చెల్లించకుండా ఇసుక కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా ఎంతలోతు వరకైనా తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

తాగునీటి పథకాలపై ప్రభావం

కృష్ణానదీ తీరంలో రక్షిత నీటి పథకాల ద్వారా గ్రామీణ నీటి సరఫరా విభాగం తాగు నీరు సరఫరా చేస్తోంది. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల నదిలో భారీ గోతులు ఏర్పడి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తీరంలో తాగు నీటి పథకాలకు నీటి లభ్యత తగ్గి లక్షల మందికి నీటి సరఫరాపై ప్రభావం పడింది. ఒకప్పుడు 20 అడుగుల లోపు నీటి లభ్యత ఉంటే ఇప్పుడు వంద అడుగులపైగా బోర్లు వేయించాల్సి వస్తోందŸని సాగుదారులు వాపోతున్నారు.

ప్రవాహ దిశ మార్చుకునే ప్రమాదం

కృష్ణానదిలో గట్టు వెంబడి ఉన్న ఇసుక కొల్లగొట్టిన మాఫియా నదీగర్భంలో ఉన్న ఇసుక తవ్వి తరలించడానికి నదిలోనే రహదారులు నిర్మిస్తున్నారు.. నదీపాయలకు అడ్డంకులు సృష్టించడంతో వరదలు వచ్చినప్పుడు ప్రవాహం దిశ మార్చుకుంటే తీరప్రాంతాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితికి మించిన లోడుతో లారీలు తిరుగుతుండడంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి.

కొల్లిపర: కోతకు గురైన సాగు భూమి

  • తాడేపల్లి మండలం గుండెమెడ క్వారీలో అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన జనసేన నేతలను మాఫియా అడ్డుకుంది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని జనసేన నేతలను అక్కడి నుంచి పంపేశారు. తవ్వకాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.  
  • మార్చి 29, 2024.. కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో తవ్వకాలను అడ్డుకున్నారని గ్రామస్థులపైనే అదే గ్రామానికి చెందినవారు దాడికి తెగబడ్డారు. ట్రాక్టరుతో మనుషులను తొక్కించడమే కాకుండా కొడవళ్లతో వారిపై దాడి చేసి మాఫియా గాయపరిచింది. ద్విచక్ర వాహనాలను ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారు. ఇసుక మాఫియా ఎంతకైనా బరి తెగిస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

నదిలో అక్రమ బాటలు, తవ్వకాలు

శివరామిరెడ్డి, బొమ్మువానిపాలెం సర్పంచి

కృష్ణానదీ తీరంలోని బొమ్మువానిపాలెం ఒకప్పుడు ప్రశాంతతకు నిలయం. నేడు నిత్యం రణగొణధ్వనులు. ఇసుక తోడుతున్న భారీ యంత్రాలు, తరలిస్తున్న లారీల శబ్దాలు. నదీ గర్భంలో అక్రమ బాటల ఏర్పాటు. అక్రమ తవ్వకాలతో, తరలింపులతో కృష్ణమ్మ దారి మళ్లుతోంది. వరదముంపులో విలువైన పంట భూములు కోతకు గురవుతున్నాయి. కృష్ణా నది సమీప భూముల్లోనూ  నీరు అడుగంటుతోంది. అక్రమ తవ్వకాలు నిలువరించాలని, నదిలో బాటలు తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అడ్డుకుంటే కేసులు పెడతామని ఇసుకాసురులు బెదిరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని