logo

మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..

రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను.

Updated : 20 Apr 2024 06:27 IST

పేదలను బలి తీసుకుంటున్న నాసిరకం మద్యం

నాలుగేళ్లలో 11,580 మంది కాలేయ బాధితులు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

 

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, ప్రత్తిపాడు: రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను.
- 2019లో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ

మాట తప్పడం.. మడమ తిప్పడంలో జగన్‌మోహన్‌రెడ్డిది తిరుగులేని రికార్డు. 2019 ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలుపై మాటిచ్చిన ఆయన జనం ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే అసలు రూపం బయటపెట్టారు. ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మద్యం ధరలు పెంచుతామన్న ఒక్క హామీని మాత్రం ఖజానా నింపుకోవడానికి నిలబెట్టుకున్నారు. కమీషన్ల కక్కుర్తితో పేరూ ఊరూ లేని.. ఎక్కడా వినని, చూడని బ్రాండ్లను జగన్‌ పారించారు. నిరుపేదల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. వారి కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా దారుణంగా దెబ్బ తీశారు. నాసిరకం మద్యానికి బలైపోయిన ఎన్నో కుటుంబాలు నేటికీ తేరుకోలేకపోతున్నాయి. ఒక్క ఫిరంగిపురంలోనే పది మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మరణాలు సంభవించినా జగన్‌ సర్కారు మాత్రం వేరే కారణాలను చూపించి తప్పించుకుంటోంది.

  • ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మేరీ. ఫిరంగిపురం నివాసి. భర్త తెనాలి బాలస్వామి (40) ఎలక్ట్రీషియన్‌. వీరికి ముగ్గురు సంతానం. పిల్లల్లో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. మద్యానికి బానిసైన బాలస్వామి మూడేళ్ల కిందట ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ పోషణ భారం మేరీపై పడింది. సొంతిల్లు లేదు. పిల్లలను చదివించే స్థోమత లేక పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారిని కూడా బేల్దారీ పనులకు తీసుకెళ్తున్నారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లాడి ఆలనాపాలనా చూసేవారు లేక తన వెంటే తీసుకెళ్తున్నానని దీనవదనంతో మేరీ చెప్పారు. నాసిరకం మద్యం ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేయగా.. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని గద్గద స్వరంతో చెప్పారు.
  • న్రాసిరకం మద్యం కారణంగా ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రులకు వెళ్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్క గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోనే నాలుగేళ్లలో 11,580 మంది చికిత్స పొందారు. బాధితులు తొలుత జీర్ణకోశవ్యాధుల బారిన పడుతున్నారు. క్రమేణా కాలేయం దెబ్బతింటోంది. ఆపై పేగుల్లో పుండ్లు ఏర్పడుతున్నాయి. చివరిగా క్లోమ గ్రంధి పాడైపోయి మరణాలు సంభవిస్తున్నాయి. నాసిరకం మద్యం తాగినవారిలో సున్నితమైన కాలేయం గట్టిపడి పూర్తిగా నిర్వీర్యమవుతోన్న కేసులు ఎక్కువగా వస్తున్నాయి. చికిత్స కోసం వేలాది రూపాయల ఖర్చుతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

  •  ప్రత్తిపాడుకు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి భార్య, ఇద్దరు (12, 14 ఏళ్లు) పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగకపోతే ఉండలేకపోయాడు. ఒంట్లో వణుకు వచ్చేది. దీంతో రోజూ రాత్రి మద్యం తాగేవాడు. అనారోగ్యానికి గురై చికిత్స కోసం వైద్యశాలకు వెళితే లివర్‌ సమస్య వచ్చిందని వైద్యులు చెప్పారు. మద్యం తాగవద్దని సూచించారు. భార్యాపిల్లల ఒత్తిడితో కొన్ని రోజులు మద్యం మానేశాడు. తర్వాత మళ్లీ తాగడం మొదలు పెట్టాడు. రెండేళ్ల కిందట పచ్చకామెర్లు, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతూ మరణించాడు.

ఒళ్లు గుల్లయి..

 ప్రత్తిపాడుకు చెందిన 35 ఏళ్ల యువకుడికి భార్య, ఇద్దరు (14, 11 ఏళ్లు) ఆడపిల్లలు ఉన్నారు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ రాత్రి పూట మద్యం తాగేవాడు. ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. మద్యం తాగకపోతే చేయి వణుకుతూ, గొంతులో మాట తడబడుతూ ఉండేది. నరాలు  బలహీనమై ఫిట్స్‌ వస్తున్నాయి. నాసి మద్యంతో లివర్‌ సమస్య వచ్చింది. తలలో నరాలు దెబ్బతిన్నాయని, మద్యం తాగడం ఆపేయాలని వైద్యులు సూచించారు. కొన్ని రోజులు ఆపుతూ, అవసరమైన వైద్యం పొందుతూ బలహీనమై పనులు చేయలేని స్థితిలో ఉన్నాడు.

ఇదీ సంగతి!

  • వైకాపా సర్కారు సరఫరా చేస్తున్న నాసిరకం మద్యం తాగి గత నాలుగేళ్లలో ఒక్క ఫిరంగిపురంలోనే ప్రాణాలు కోల్పోయినవారు పది మంది. వీరిలో మద్యం కొనేందుకు డబ్బులు లేక కరోనా సమయంలో శానిటైజర్‌ తాగి చనిపోయినవారు ముగ్గురు ఉన్నారు. మృతుల్లో అత్యధికులు ఎస్సీ వర్గాలవారే.
  •  నాసిరకం మద్యం తాగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని 2020 నుంచి 2023 మధ్యకాలంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చేరిన రోగుల సంఖ్య  11,580. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం బాధితులు ఆస్పత్రికి రాలేదని జీర్ణకోశ వ్యాధి నిపుణులు చెబుతున్నారు.
  •  ఈ ఆసుపత్రికి వారంలో 200 వరకు మద్యం బాధిత కేసులు వస్తున్నాయి.
  •  బాధితుల్లో ఎక్కువ మంది కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె బలహీనపడడం, కంటిచూపు మందగించడం, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు.

    పేగులో పుండ్లు ఏర్పడుతున్నాయి..

- ఆచార్య నాగూర్‌ బాషా, సహాయ ఆచార్యుడు, జీజీహెచ్‌

మద్యం తాగడం ఆరోగ్యానికి అన్నివిధాలా దెబ్బే. ఈ దుష్పరిణామాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలి. నాసిరకం మద్యం వల్ల పేగుల్లో పుండ్లు ఏర్పడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. క్రమేణా మిగిలిన అవయవాలు కూడా దెబ్బతిని ప్రాణాలమీదకొస్తోంది. కాలేయం దెబ్బతినడమే కాదు.. మెదడులో రక్తం గడ్డకట్టి న్యూరో సమస్యలొస్తున్నాయి. గుండె బలహీనపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు