logo

రూ.పదివేలిచ్చి రెండెకరాలు కాజేశాడు

రైతుబంధు సొమ్ములు రావడంలేదంటూ ఓ వృద్ధురాలు తన గ్రామానికే చెందిన ఓ పైరవీకారుడికి తెలిపింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొన్న ఆ వ్యక్తి ఆ

Updated : 12 Jul 2021 07:33 IST
రైతుబంధు డబ్బులిప్పిస్తానంటూ వృద్ధురాలిని మోసగించిన పైరవీకారుడు
జిల్లేడు చౌదరిగూడెం, న్యూస్‌టుడే: రైతుబంధు సొమ్ములు రావడంలేదంటూ ఓ వృద్ధురాలు తన గ్రామానికే చెందిన ఓ పైరవీకారుడికి తెలిపింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొన్న ఆ వ్యక్తి ఆ డబ్బులిప్పిస్తానంటూ నమ్మబలికి.. రెండెకరాల భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ జాయింట్‌ సబ్‌రిజిస్టర్‌ కార్యాలయం పరిధిలో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

వేలి ముద్రతో డబ్బులు వస్తాయని..

మండల పరిధిలోని చేగిరెడ్డిఘణాపూర్‌కు చెందిన సోమన్నగారి లక్ష్మమ్మకు గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 46లో 2 ఎకరాల 17 గుంటల భూమి ఉంది. రైతుబంధు డబ్బులు క్రమం తప్పకుండా వచ్చేవి. ఇటీవల నిలిచిపోవడంతో.. గ్రామానికి చెందిన ఓ స్థిరాస్తి పైరవీకారుడికి తన పాస్‌పుస్తకాన్ని ఇచ్చి ఆ డబ్బు వచ్చేలా చూడాలని కోరింది. ఆమె అమాయకురాలు కావడంతో తహసీల్దార్‌ కార్యాలయంలో వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని చెప్పాడు. అతడు సూచించిన మేరకు ఆమె 22.03.2021న అక్కడికి వెళ్లింది. ఆమెకున్న భూమిలో రెండెకరాలను.. అదే రోజున సీఎస్‌ నం.2100271672 డాక్యుమెంట్‌తో ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఎర్రం నర్సింలు పేరిట జిల్లేడు చౌదరిగూడ జాయింట్‌ సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో పట్టా చేయించాడు. తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను ఆరా తీయగా, సంగతంతా వారికి పూసగుచ్చినట్లు వివరించింది. సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలోని సీసీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను గుర్తించి పంచాయితీ పెట్టినట్లు సమాచారం.

ఇలా మోసం చేస్తారనుకోలేదు: లక్ష్మమ్మ

రైతుబంధు సొమ్ముల కోసమే కదా అని కుమారులకు చెప్పకుండా వెళ్లిన పాపానికి ఇంతపనికి ఒడిగట్టాడు. విడతలవారీగా రూ.పది వేలను అందించాడు. ఇంత మోసానికి పాల్పడిన పైరవీకారుడిపై కఠిన చర్యలు చేపట్టాలని కన్నీటి పర్యంతమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని