logo

గంజాయి నిల్వ స్థావరంగా మహారాష్ట్ర!

మత్తు పదార్థాల రవాణాపై రాష్ట్రంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు కొత్తదారుల్లో ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆంధ్రా ఒడిశా బార్డర్‌ నుంచి వచ్చిన గంజాయిని నగర శివారు ప్రాంతాల్లో నిల్వ ఉంచేవారు.

Published : 19 Jan 2022 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: మత్తు పదార్థాల రవాణాపై రాష్ట్రంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు కొత్తదారుల్లో ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆంధ్రా ఒడిశా బార్డర్‌ నుంచి వచ్చిన గంజాయిని నగర శివారు ప్రాంతాల్లో నిల్వ ఉంచేవారు. ఇటీవల సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు గట్టి నిఘాతో కొద్ది సమయంలోనే దాదాపు 11,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. దీంతో స్మగర్లు సరకు నిల్వ చేసేందుకు మహారాష్ట్రను ఎంచుకొంటున్నారు. ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడిన ముఠా ద్వారా ఈ వివరాలు సేకరించినట్లు సమాచారం.

దళారులదే కీలకపాత్ర.. గంజాయి పండించే ప్రాంతాలు. నిల్వ చేసే ప్రదేశాలు వేర్వేరుగా ఉంటాయి. పెద్దఎత్తున గంజాయి కొనుగోలు చేసే వ్యాపారులు సైతం ఇప్పటి వరకు నిల్వ స్థావరాలకు వెళ్లే సాహసం చేయలేదని తెలుస్తోంది. ఆంధ్ర-ఒడిశా బార్డర్‌(ఏవోబీ)లోనే 95 శాతం పంట సాగవుతుంది. అక్కడి నుంచి రంపచోడవరం, సీలేరు అటవీప్రాంతాల్లో దాన్ని నిల్వ ఉంచుతారు. బయటి వ్యక్తులు అక్కడకు చేరకుండా పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయని సమాచారం. మారణాయుధాలతో కాపలా కాసే సిబ్బంది కొత్తవారు కనిపిస్తే ప్రాణాలు తీసేందుకు వెనకాడబోరని తెలుస్తోంది. అటువంటి రహస్యప్రదేశం నుంచి గంజాయి ప్యాకెట్లను బయటకు తీసుకొచ్చే వరకూ దళారులదే కీలకపాత్ర. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వాహనాల డ్రైవర్లు, స్మగ్లర్లతో ఏర్పడిన పరిచయాలతో వీరు ముఠాలుగా ఏర్పడుతున్నారు. గతంలో సరకు సరఫరా చేస్తూ పట్టుబడటానికి కారణాలు, తప్పిదాలను పంచుకుంటూ కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. పెద్దఎత్తున గంజాయి కొనుగోలు చేసే కీలక వ్యక్తుల నుంచి ఎంత సరకు కావాలనే వివరాలు దళారులు సరఫరాదారులకు చేరవేస్తారని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు.

సరిహద్దు దాటిస్తే రూ.లక్షల్లో లాభం.. గంజాయి సరఫరా చేసే వాహనాన్ని మహారాష్ట్రకు చేర్చితే చాలు. ఒక్కో డ్రైవర్‌కు ట్రిప్పునకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తున్నారు. ఏజెన్సీల్లో కిలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కొనుగోలు చేసి సరఫరాదారులు మహారాష్ట్రలోని కీలక వ్యక్తులకు కిలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు. వాళ్లు దాన్ని గ్రాముల్లోకి మార్చి పొట్లాలు కట్టి 10 గ్రాములు రూ.500 నుంచి రూ.600 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దూల్‌పేట్‌లో అబ్కారీ అధికారులు గంజాయి దొరక్కుండా చేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు. సరకు దొరకటమే కష్టంగా మారటంతో మత్తుకు బానిసలైన బాధితులు 5 నుంచి 10 గ్రాముల గంజాయి రూ.1000 రూ.1500 ఇచ్చి తీసుకొనేందుకు సిద్ధపడుతున్నారు. కళ్ల ముందు ఇన్ని లాభాలు కనిపిస్తుండటంతో మత్తు మాఫియా.. యువకులు, పేదలకు పెద్దఎత్తున అడ్డు ఆశ చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఇటీవల గంజాయి రవాణాలో పోలీసులకు పట్టుబడుతున్న వారంతా నిరక్షరాస్యులు, కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకొనే వారే ఉండటం ఇందుకు నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని