logo

ట్రాన్స్‌పోర్టు యజమానికి బురిడీ.. సిమెంటు చోరీ

చరవాణినే పెట్టుబడిగా సిమెంటు ఎగుమతి వ్యాపారానికి తెరలేపాడో ప్రబుద్ధుడు. తెలిసిన వారి లారీ పత్రాలను చూపి సిమెంటు పంపిస్తానని ట్రాన్స్‌పోర్టు యాజమానిని నమ్మించాడు. అయితే చేరవేయాల్సిన ప్రాంతానికి

Published : 22 Jan 2022 01:03 IST


గౌతాపూర్‌ ఠాణా వద్ద లారీ

గౌతాపూర్‌(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: చరవాణినే పెట్టుబడిగా సిమెంటు ఎగుమతి వ్యాపారానికి తెరలేపాడో ప్రబుద్ధుడు. తెలిసిన వారి లారీ పత్రాలను చూపి సిమెంటు పంపిస్తానని ట్రాన్స్‌పోర్టు యాజమానిని నమ్మించాడు. అయితే చేరవేయాల్సిన ప్రాంతానికి కాకుండా మరోచోటుకి తరలించి గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. నగదు చెల్లించిన వ్యక్తి సరకు ఇంకెప్పుడు చేరవేస్తారంటూ, ట్రాన్స్‌పోర్టు యజమానిపై ఒత్తిడి తేవడంతో లారీ చోదకుడిని ప్రశ్నించడంతో అదిగోఇదిగో అంటూ వారంరోజులు గడిపాడు. చివరకు ఆయననే బెదిరించడంతో, తాను మోసపోయానని అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో చోరీ గుట్టురట్టయింది. బాధితుడు శుక్రవారం విలేకరులకు వెల్లడించిన ప్రకారం.. యాలాల మండలం ముద్దాయిపేటకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ గౌతాపూర్‌ చౌరస్తాలో సాయిబాబా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేశారు. చెట్టినాడు కర్మాగారం నుంచి సిమెంటు ఎగుమతులకు లారీలను సమకూర్చుతున్నారు. ఈక్రమంలో వారం కిందట పట్టణంలోని ఖాన్‌కాలనీకి చెందిన సురేష్‌ అలియాస్‌ హర్షద్‌ శ్రీనివాస్‌గౌడ్‌ చరవాణికి ఫోన్‌ చేసి తన వద్ద లారీ ఉందని, కరీంనగర్‌కు సిమెంటు ఎగుమతి చేస్తానని చెప్పాడు. లారీ పత్రాలు ఆరా తీయగా మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలం పగిడ్యాలకు చెందిన మహిపాల్‌రెడ్డి, సంజీవరెడ్డిల లారీ పత్రాలను చూపించాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు యజమాని లారీలో రూ.15వేల డీజిల్‌ పోయించి రూ.2లక్షల విలువైన 26టన్నుల సిమెంటును లోడ్‌ చేయించి కరీంనగర్‌లో చేరవేసేందుకు పంపించాడు. మూడు రోజులు గడిచినా అక్కడికి సిమెంటు చేరలేదు. దీంతో సురేష్‌, సంజీవరెడ్డికి యజమాని ఫోన్‌ చేసినా దాటవేశారు. అదేమని నిలదీస్తే దూషిస్తూ బెదిరింపులకు పాల్పడటంతో ఈనెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సురేష్‌, చోదకుడు సంజీవరెడ్డిలు కోస్గిలోని ఓ సిమెంటు డీలరుకు తక్కువ ధరకు విక్రయించి నగదు పొందినట్లు తేల్చారు. ఈ వ్యవహారమంతా కోస్గిలోని సీసీ కెమెరాలో నిక్షిప్తం అయి ఉండటంతో చోదకుడు సంజీవరెడ్డి, సిమెంటు డీలరును అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. సురేష్‌ అలియాస్‌ హర్షద్‌ పరారీలో ఉన్నాడు. వీరంతా ఇదేతరహాలో గతంలోనూ పలు లారీల్లో సిమెంటును పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారని ట్రాన్స్‌పోర్టు యజమానులు, నిర్వాహకులు వెల్లడించారు. నిందితులను శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
పోలీసులు చోదకుడిని, డీలరను ఠాణాకు తరలిస్తే జిల్లా స్థాయి నాయకుడు ఒకరు వచ్చి తీసుకెళ్లినట్లు సమాచారం. గతంలో పలు లారీల్లో సిమెంటు చోరీ చేసిన నిందితులను వదిలేయాలంటూ నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి విడిపించారని, దీంతో కొందరు అదేపనిగా సిమెంటు చోరీని దర్జాగా కానిచ్చేస్తున్నారని ట్రాన్స్‌పోర్టు యజమానులు, నిర్వాహకులు విలేకరుల ముందు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని