logo

పెరగనున్న పత్తి, కంది సాగు

వానాకాలం సాగుకు సంబంధించిన పంటల ప్రణాళిక ఖరారయ్యింది. జిల్లా వ్యవసాయాధికారులు దీనిని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ డివిజన్ల పరిధిలో 5.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు

Published : 19 May 2022 02:11 IST

ఖరీఫ్‌ పంటల ప్రణాళిక ఖరారు
న్యూస్‌టుడే, వికారాబాద్‌, పరిగి

ఎరువు కలుపుతున్న రైతులు

వానాకాలం సాగుకు సంబంధించిన పంటల ప్రణాళిక ఖరారయ్యింది. జిల్లా వ్యవసాయాధికారులు దీనిని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ డివిజన్ల పరిధిలో 5.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎరువులు, విత్తనాల అవసరాలను కూడా రూపొందించారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత సీజన్‌లో 5.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు.

తెల్లబంగారం వైపే మొగ్గు..
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అత్యధికంగా పత్తి పంట వేయడం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి క్వింటాలు ప్రభుత్వ మద్ధతు ధర రూ.6,225 ఉండటం, బహిరంగ విపణిలో ధర రూ.10 వేల పైచిలుకు పలకడంతో అధిక శాతం రైతులు పత్తి సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. నిరుడు కూడా ప్రతికూల వాతావరణంతో పత్తి దిగుబడి తగ్గినా విపణిలో మంచి గిట్టుబాటు ధర లభించడంతో లాభాలు ఆర్జించారు. గతేడాది జిల్లాలో 1.96 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా, పంట నష్టపోయి ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గినా గరిష్ఠంగా పత్తి క్వింటాలుకు రూ.9,500 అమ్ముడుపోయింది. పత్తికి బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు నష్టాలనెదుర్కొన్నారు. నాలుగేళ్ల అనుభవాల దృష్ట్యా అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.

విత్తనాలు, ఎరువులు
పంటలకు అనుగుణంగా విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2.5 లక్షల ఎకరాల పత్తి పంటకు ఎకరానికి రెండు పొట్లాలు(ప్యాకెట్లు) చొప్పున 5 లక్షల పొట్లాలు అవసరమవుతాయని అంచనా. కందికి 11 వేల క్వింటాళ్లు, వరికి 22,500 క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,100 క్వింటాళ్లు, సోయాబిన్‌ 100 క్వింటాళ్లు, మినుములు 800 క్వింటాళ్లు, పెసర 1,200 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. రాయితీ లేనందున్న వీటిని కొనుగోలు చేయల్సిందే. జిల్లాలో ఆయా రకాల పంటలు సాగు చేసేందుకు 95 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయని అధికారులు అంచనా వేశారు.

కంది: గత సీజన్‌లో 1.8 లక్షల ఎకరాల్లో కంది పంట సాగయింది. ఈసారి అదనంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు అంచనా వేసి ఆ దిశగా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మద్ధతు ధర క్వింటాలుకు రూ.6,159 ప్రకటించగా, బహిరంగ విపణిలో మద్దతు మించి రూ.6,500 వరకు పలుకుతోంది. వరి తగ్గించి కంది సాగు వైపు రైతులను మొగ్గు చూపేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కందిలో అంతర పంటగా అపరాలు(పెసర), మినుము, మొక్కజొన్న పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

మొక్కజొన్న: బహిరంగ విపణిలో మక్కలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.1870 కాగా, బహిరంగ విపణిలో క్వింటాలు ధర రూ.2200 నుంచి రూ.2350 వరకు పలుకుతోంది. ధర లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటే క్వింటాకు రూ.600 నష్టాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని, అందుకే మొక్కజొన్న సాగు చేపట్టకూడదని, ఒకవేళ సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. అయినా మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో గత వానాకాలం సీజన్‌లో 66 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి అధికంగా సాగుకానుంది. 

వరి: గత సీజన్‌లో 1.2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 30 వేల విస్తీర్ణం తగ్గించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం, విద్యుత్తు, రోజు విడిచి రోజు నీటి తడులు పెట్టడం వంటి సమస్యలను ఏకరువు పెట్టి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులను మళ్లించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.


పంట మార్పిడి విధానం పాటించాలి
గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

గతంలో కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో పత్తి, కంది పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. తొలిసారిగా క్లస్టర్ల వారీగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. పంట మార్పిడి విధానం అవలంభించాలని, వేసిన పంటలే వేస్తే భూసారం తగ్గడం, చీడపీడల బెడదతో పంటల దిగుబడులు తగ్గుతాయన్నది గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని